Trisha: నటి త్రిష అసహనం... వారిని చూస్తుంటే భయంగా ఉందన్న నటి!

- సోషల్ మీడియాలో నెగెటివిటీని వ్యాప్తి చేసే వారిపై నటి త్రిష ఆగ్రహం
- విషపూరితమైన స్వభావంతో ఎలా ప్రశాంతంగా ఉంటున్నారని అసహనం
- ఇతరులపై బురద జల్లడమే వారి పని అని అంటూ ఇన్‌స్టా పోస్ట్
సామాజిక మాధ్యమాల్లో నెగెటివిటీని వ్యాప్తి చేసే వారిపై నటి త్రిష అసహనం వ్యక్తం చేశారు. ఇంతటి విషపూరితమైన స్వభావంతో ఎలా ప్రశాంతంగా ఉంటున్నారని మండిపడ్డారు. ఇతరులపై బురద జల్లడమే వారి పని అని పేర్కొన్నారు.
"విషపూరితమైన వ్యక్తులు... అసలు మీరెలా జీవిస్తున్నారు... మీకు ప్రశాంతంగా నిద్ర ఎలా పడుతుంది. ఖాళీగా కూర్చొని ఇతరులపై బురద జల్లడమే మీ పని. సోషల్‌మీడియాలో పిచ్చిపిచ్చి పోస్టులతో రాక్షసానందం పొందుతున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నిజంగా భయమేస్తుంది. నిజం చెప్పాలంటే మీది పిరికితనం. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నా" అని త్రిష ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు.
కాగా, గతంలోనూ త్రిష ఈ విధంగా తప్పుడు కథనాలు వ్యాప్తి చేసే వారిపై సోషల్ మీడియా వేదికగా పోస్టుల ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనీపాట లేని వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అప్పట్లో ధ్వజమెత్తారు.
ఇక తాజాగా పోస్టు పెట్టడానికి కారణం... ఆమె నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలోని ఆమె పాత్రను కొంతమంది మెచ్చుకుంటే, మరికొంత మంది విమర్శించారు. ఆమె నటన ఏమీ బాలేదని, తమిళం తెలిసిన ఆమె తన పాత్రకు వేరే వారితో డబ్బింగ్ చెప్పించడం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు త్రిష గురించి నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా స్పందించారు.