three years of periods: మూడేళ్లుగా రోజూ నెలసరి.. అమెరికా మహిళకు వింత పరిస్థితి

--
నెలసరి సమయంలో మహిళలు శారీరకంగా, మానసికంగా అసౌకర్యానికి గురవుతుంటారు. రక్తస్రావం కారణంగా అనారోగ్య సమస్యలూ చుట్టుముడతాయి. నెలనెలా మూడు నుంచి వారం రోజుల పాటు ఇబ్బంది పడుతుంటారు. అయితే, అమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం మూడేళ్లుగా రోజూ పీరియడ్స్ తో ఇబ్బంది పడుతోంది. ప్రతీ రోజూ రక్తస్రావం జరుగుతోందని, ఎంతమంది వైద్యులను కలిసినా ఉపయోగం లేకుండా పోయిందని వాపోతోంది. మూడు నాలుగు రోజులు ఉండే పీరియడ్స్ మూడేళ్లుగా కొనసాగుతున్న వింత పరిస్థితిని ఆమె టిక్ టాక్ వీడియో ద్వారా సోషల్ మీడియాలో పంచుకుంది. రోజూ రక్తస్రావం జరుగుతుండడంతో తరచూ తలనొప్పి, తిమ్మిర్లు, కండరాల నొప్పులతో ఇబ్బందిపడుతున్నట్లు చెప్పింది.
అమెరికాకు చెందిన పాపీ అనే మహిళ ఈ సమస్యను ఎదుర్కొంటోంది. ఈ విషయంలో ఎంతమంది వైద్యులను కలిసినా, ఎన్ని చికిత్సలు తీసుకున్నా పీరియడ్స్ మాత్రం ఆగలేదని పాపీ తెలిపారు. దాదాపు 950 రోజుల తర్వాత తన సమస్యకు అసలు కారణం తెలిసిందని పాపీ వెల్లడించింది. వైద్య పరిభాషలో ‘బైకార్నుయేట్ యుటెరస్’ కారణంగా తనకు పీరియడ్స్ ఆగడంలేదని, ఈ పరిస్థితి అత్యంత అరుదని వైద్యులు చెప్పారని వివరించింది. కేవలం 5 శాతం మంది మహిళలు మాత్రమే ఈ పరిస్థితిని ఎదుర్కొంటారని, ఆ ఐదు శాతం మంది మహిళల్లోనూ చాలామందిలో బైకార్నుయేట్ యుటెరస్ లక్షణాలు కనిపించవని చెప్పారన్నారు.
అసలు కారణం తెలియడంతో ప్రస్తుతం వైద్యులు చికిత్స ప్రారంభించారని తెలిపారు. హార్మోనల్ థెరపీతో పాటు శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. కాగా, రోజూ పీరియడ్స్ రావడంతో తనకు చాలా సమస్యలు ఎదురయ్యాయని, తన సంపాదనలో పెద్దమొత్తం ప్యాడ్స్ సహా ఇతరత్రా నెలసరి ఉత్పత్తుల కొనుగోలుకే వెచ్చించాల్సి వచ్చిందని పాపీ వివరించారు. పీరియడ్స్ లేకుండా ఉంటే ప్రతీ రోజూ ఓ స్వర్గమేనని తాను భావిస్తున్నట్లు పాపీ పేర్కొన్నారు.