2028 Olympics: 2028 ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్ క్రికెట్

- మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో ఆరు జట్ల చొప్పున అవకాశం
- ఒక్కో జట్టు నుంచి 15 మంది చొప్పున 90 మంది క్రికెటర్లకు అనుమతి
- ఈ మేరకు బుధవారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వెల్లడి
లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్ క్రీడలలో టీ20 ఫార్మాట్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. మెన్స్, ఉమెన్స్ విభాగాల్లో ఆరు జట్ల చొప్పున పాల్గొంటాయి. ఒక్కో జట్టు నుంచి 15 మంది చొప్పున 90 మంది క్రికెటర్లకు అనుమతిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) బుధవారం ధృవీకరించింది.
ఈ మేరకు 2028 ఒలింపిక్ క్రీడల కోసం ఈవెంట్ ప్రోగ్రామ్, అథ్లెట్ కోటాలను ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు నిన్న ఆమోదించింది. ఇందులో భాగంగానే టీ20 ఫార్మాట్‌లో క్రికెట్‌ను నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, క్రికెట్ మ్యాచ్ వేదికలు, షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు.
రాబోయే ఒలింపిక్స్‌లో మొత్తం ఐదు కొత్త క్రీడలకు ఐఓసీ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. వాటిలో క్రికెట్ ఒకటి. బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్ (సిక్సర్లు), స్క్వాష్‌లతో పాటు క్రికెట్‌ను చేర్చడానికి ఒలింపిక్ కమిటీ రెండేళ్ల క్రితం ఆమోదం తెలిపింది.
కాగా, ఒక శతాబ్దానికి పైగా ఒలింపిక్స్‌లో క్రికెట్ కనిపించలేదు. చివరిసారిగా 1900 పారిస్ ఒలింపిక్ క్రీడలలో గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ మధ్య ఒకే ఒక్క రెండు రోజుల క్రికెట్ మ్యాచ్ జరిగింది.
లాస్ ఏంజెలిస్ 2028 ఒలింపిక్ క్రీడల్లో క్రికెట్‌ను చేర్చడం వలన ఈ క్రీడ ఇతర అంతర్జాతీయ ఈవెంట్‌లలో కనిపించే అవకాశం కూడా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 1998లో కౌలాలంపూర్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మెన్స్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించగా, ఉమెన్స్ క్రికెట్ 2022లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో అరంగేట్రం చేసింది.