Mahavat: తండ్రిని చంపిన హంతకుడ్ని 15 ఏళ్ల తర్వాత అదే రీతిలో చంపేసిన కొడుకులు!

- యూపీలో దారుణ హత్య
- 2009లో రాంపాల్ అనే వ్యక్తిని హత్య చేసిన మహావత్
- 15 ఏళ్ల జైలు శిక్ష అనంతరం గతేడాది విడుదల
- తాజాగా మహావత్ ను కొట్టి చంపిన రాంపాల్ కుమారులు
ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. 15 సంవత్సరాల క్రితం తమ తండ్రిని హత్య చేసిన వ్యక్తిని ఇద్దరు కుమారులు అదే ప్రదేశంలో కర్రలతో కొట్టి చంపారు. మృతుడిని మహావత్ అలియాస్ సర్పంచ్ గా గుర్తించారు.
2009లో రాంపాల్ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో మహావత్ 15 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి గత సంవత్సరం విడుదలయ్యాడు. రాంపాల్ కుమారులు రాహుల్, భీరూ తమ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
వారు మహావత్‌ను వారి తండ్రి హత్య జరిగిన ప్రదేశానికి సమీపంలో గుర్తించి, అతనిపై దాడి చేశారు. రాహుల్, భీరు సహా 30 మంది ఈ దాడిలో పాల్గొన్నారు. కర్రలతో తీవ్రంగా కొట్టడంతో మహావత్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, అతను మరణించాడు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 18 మందిని అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. 15 ఏళ్ల క్రితం జరిగిన హత్యకు ప్రతీకారంగా ఈ దారుణం జరగడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
దాడికి పాల్పడ్డవారిలో మహిళలు కూడా ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన 18 మందిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. విచారణలో రాహుల్, భీరూ మాట్లాడుతూ... "మా తండ్రిని కర్రలతో కొట్టి చంపాడు, అందుకే మేము కూడా అదే విధంగా చంపేశాం" అని చెప్పారు. మహిళా నిందితులు కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "జరగాల్సింది జరిగింది, కాస్త ఆలస్యమైంది అంతే" అని వారు అన్నారు. నిందితుల్లో ఎటువంటి పశ్చాత్తాపం కనిపించలేదని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఇంకా 12 మంది నిందితులను గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.