Sabra: రూ.4 కోట్లకు పైగా ఆదాయం ఉందంటూ దినసరి కూలీకి ఐటీ శాఖ నోటీసులు!

- ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ నోటీసులు
- మూడేళ్ల క్రితం వచ్చిన నోటీసులకు స్పందించని వృద్ధురాలు
- తాజాగా, మరోసారి నోటీసులు ఇచ్చిన అధికారులు
- యూపీలోని జస్రన పట్టణంలో ఘటన
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక నిరుపేద వృద్ధురాలికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ఆమెకు రూ. 4 కోట్లకు పైగా ఆదాయం ఉందని, అందుకు సంబంధంచిన ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సబ్రా అనే వృద్ధురాలు జస్రన పట్టణంలోని మురికివాడలో తన భర్తతో కలిసి నివసిస్తోంది. ఆ దంపతులిద్దరూ దినసరి కూలీలు.
2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2021-22 ఏడాదికి రూ. 4.88 కోట్లకు పైగా ఆదాయపు పన్ను చెల్లించాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు మూడేళ్ల కిందట నోటీసులు జారీ చేశారు. సబ్రాకు చదువు రాకపోవడంతో ఆమె ఆ నోటీసులకు స్పందించలేదు. ఆమె పన్ను చెల్లింపు జరపకపోవడంతో అధికారులు తాజాగా మరోసారి నోటీసులు పంపారు.
2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని సూచించారు. పన్ను ఎందుకు చెల్లించలేదో వివరణ ఇవ్వాలని కూడా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న వృద్ధ దంపతులు షాక్ అయ్యారు.
ఈ ఘటనపై న్యాయవాది సంజయ్ జన్ మీడియాతో మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో నోటీసులు జారీ చేసే సమయంలో పొరపాట్లు జరుగుతున్నాయని అన్నారు. అందులో భాగంగానే వృద్ధురాలికి నోటీసులు వచ్చాయని తెలిపారు. పొరపాటు జరగని పక్షంలో ఆధార్ ఫోర్జరీకి సంబంధించిన అంశం కూడా అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.