KTR: పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు... కేంద్రంపై కేటీఆర్ ఆగ్రహం

KTR Condemns Central Governments Petrol Gas Price Hike

  • ఇంధన ధరల పెంపు ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేసిందని విమర్శ
  • పాక్ సహా వివిధ దేశాల కంటే పెట్రోల్ ధరలు మన దేశంలోనే ఎక్కువగా ఉన్నాయన్న కేటీఆర్
  • అధిక ఆదాయం ఇస్తున్న రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయిస్తోందని విమర్శ

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇంధన ధరల పెరుగుదల సామాన్య ప్రజల జీవనాన్ని దుర్భరం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ వంటి దేశాలతో పోలిస్తే మన దేశంలోనే పెట్రోల్ ధరలు అధికంగా ఉండటం శోచనీయమని అన్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి కేటీఆర్ లేఖ రాశారు.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను తగ్గించకపోవడం విమర్శలకు తావిస్తోందని అన్నారు. కేంద్రం విధిస్తోన్న సెస్సుల కారణంగా రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. 'మినిమం గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవర్నెన్స్' అనేది కేవలం నినాదంగా మిగిలిపోయిందని, 'మ్యాగ్జిమమ్ ట్యాక్సేషన్, మినిమమ్ రిలీఫ్‌' అన్న చందంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు.

పెట్రోల్ ధరలను సెస్సుల రూపంలో పెంచుతూ మోదీ ప్రభుత్వం ప్రజలను ఆర్థికంగా దోపిడీ చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. పన్నుల రూపంలో రాష్ట్రాలకు రావాల్సిన న్యాయమైన వాటాను ఇవ్వకుండా దేశ సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు. 

దేశ ఆర్థికాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం గణనీయంగా సహకరిస్తున్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అరకొర నిధులతో నెట్టుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు. అధిక ఆదాయం సమకూరుస్తున్న రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయిస్తోందని ఆరోపించారు.

KTR
KTR on Petrol Price Hike
Petrol Price Hike
Gas Price Hike
India Petrol Prices
Modi Government
Central Government
BRS
Hardeep Singh Puri
Telangana
  • Loading...

More Telugu News