Jagan Mohan Reddy: ఇలా కూడా ఆలోచిస్తారా?: జగన్ పై అనిత ఫైర్

- నిన్నటి జగన్ పర్యటన డ్రామాను తలపించిందన్న అనిత
- జగన్ పర్యటనకు 11 వందల మంది పోలీసులతో భద్రత కల్పించామని వెల్లడి
- జగన్ మారకపోతే 11 సీట్లు కూడా రావని జోస్యం
వైసీపీ అధినేత జగన్ రాప్తాడు పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. టీడీపీపై, పోలీసులపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో హోం మంత్రి అనిత స్పందిస్తూ... నిన్నటి జగన్ పర్యటన డ్రామాను తలపించిందని అన్నారు. జగన్ పర్యటన సందర్భంగా 1,100 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశామని... డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు కూడా ఇంతటి భద్రతను కల్పించలేదని చెప్పారు. జగన్ వెళుతున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ అని... అందుకే భారీ భద్రతను కల్పించామని అన్నారు. కానీ, కావాలనే సీన్ క్రియేట్ చేశారని మండిపడ్డారు.
హెలిపాడ్ వద్దకు వైసీపీ కార్యకర్తలు తోసుకుంటూ వచ్చారని... ఈ క్రమంలో కొంతమంది పోలీసులకు గాయాలయ్యాయని అనిత చెప్పారు. హెలికాప్టర్ దెబ్బతిన్నదని చెబుతూ జగన్ రోడ్డు మార్గంలో వెళ్లిపోయారని... కాసేపటికే హెలికాప్టర్ వెళ్లిపోయిందని తెలిపారు. ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం చేశారని విమర్శించారు. ఇలా కూడా ఆలోచిస్తారా? అని అనిపించిందని చెప్పారు.
వైసీపీ హయాంలో 2,800కి పైగా టీడీపీ నేతలు, కార్యకర్తల హత్యలు జరిగాయని అనిత తెలిపారు. ఇప్పటి సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సహా నాపైనా కేసులు పెట్టారని దుయ్యబట్టారు. రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమది ఇలాంటి సంస్కృతి కాదని చెప్పారు.
పోలీసు అధికారుల బట్టలు ఊడదీస్తానని మాజీ సీఎం అనొచ్చా? అని అనిత ప్రశ్నించారు. ఇలాంటి ప్రవర్తన వల్లే 151 నుంచి 11కి దిగిపోయావని ఎద్దేవా చేశారు. నువ్వు మారకపోతే వచ్చే ఎన్నికల్లో 11 కూడా రావని అన్నారు. జగన్ వెళ్లిన వెంటనే హెలికాప్టర్ వెళ్లిపోవడంపై దర్యాప్తు చేస్తామని చెప్పారు. వైసీపీ వాళ్లు పద్ధతి మార్చుకోకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. ఎస్సై సుధాకర్ కు నిజంగా దమ్ముందని అన్నారు. పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు జగన్ సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు.