Donald Trump: విదేశీ విద్యార్థులపై ట్రంప్ మరో పిడుగు.. 3 లక్షల మంది భారతీయులపై ప్రభావం

- ఓపీటీ ప్రోగ్రామ్ ఎత్తివేస్తే విదేశీ విద్యార్థులతో పాటు అమెరికా వర్సిటీలకూ నష్టమే
- ఓపీటీతో కోర్సు పూర్తయ్యాక మూడేళ్ల పాటు అమెరికాలో పనిచేసే అవకాశం
- అమెరికా యూనివర్సిటీలలో విదేశీ విద్యార్థుల చేరికపై ప్రభావం
అమెరికాలోని వివిధ యూనివర్సిటీలలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత చేసే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్ ను రద్దు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనలతో ఓ బిల్లును కూడా సిద్ధం చేశారు. అమెరికన్ కాంగ్రెస్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపితే విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నిర్ణయంతో అమెరికాలో చదువుకుంటున్న 3 లక్షల మంది భారతీయుల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది. ఈ ప్రతిపాదిత బిల్లు నేపథ్యంలో విదేశీ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఏమిటీ ఓపీటీ?
ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్.. అమెరికాలోని యూనివర్సిటీలలో చదువు పూర్తిచేసుకున్న విదేశీ విద్యార్థులకు మూడేళ్ల పాటు ప్రాక్టికల్ వర్క్ కోసం అనుమతిచ్చే కార్యక్రమం. ఈ ప్రోగ్రాం కారణంగా విద్యార్థులు తమ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అమెరికాలోనే మూడేళ్ల పాటు పనిచేసే అవకాశం లభిస్తుంది. ఆ అనుభవంతో అదే కంపెనీలో పనిచేస్తూ హెచ్ 1 బీ వీసా పొందడం లేదా మరో కంపెనీలో హెచ్ 1 బీ వీసాతో ఉద్యోగం పొందే వీలుంటుంది. ఈ విధానం ద్వారా భారతీయ విద్యార్థులు అధిక ప్రయోజనం పొందుతున్నారు.
ఈ ప్రోగ్రామ్ ను ఎత్తివేస్తే..
ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు తమ కోర్సు పూర్తవగానే ఇండియా విమానం ఎక్కాల్సి వస్తుంది. దీనివల్ల వారు కెరీర్ పరంగా, ఆర్థికంగా తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతారు. పరిమితంగా ఉండే హెచ్ 1 బీ వీసాల కోసం పోటీపడడం సాధ్యం కాదు. అదేసమయంలో అమెరికాకు కూడా ఈ బిల్లుతో నష్టం వాటిల్లే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశీ విద్యార్థులు ఉన్నతవిద్యాభ్యాసం కోసం ఎక్కువగా అమెరికాను ఎంచుకోవడానికి కారణం ఈ ప్రోగ్రామే. చదువు పూర్తయ్యాక అక్కడే మూడేళ్లు పనిచేస్తే హెచ్ 1 బీ వీసా పొందే అవకాశం ఉండడం విదేశీ విద్యార్థులను ఆకర్షిస్తోంది.
ఈ ప్రోగ్రాం ఎత్తివేస్తే విదేశీ విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలలో చేరే అవకాశం తగ్గుతుంది. ఫలితంగా యూనివర్సిటీలకు, అమెరికాకు ఆదాయం తగ్గుతుంది. దీంతోపాటు అమెరికా కంపెనీలకు నిపుణులైన ఉద్యోగులు దొరకడం దుర్లభంగా మారుతుంది. ఏటా పరిమిత సంఖ్యలో జారీ చేసే హెచ్ 1 బీ వీసాలతో కంపెనీల మానవ వనరుల అవసరాలు తీరే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.