Narendra Modi: హిందీ రాదు సార్ అన్న ఏపీ మహిళ.. తెలుగులోనే మాట్లాడాలని చెప్పిన మోదీ.. వీడియో ఇదిగో!

––
ప్రధానమంత్రి ముద్రా యోజన 10వ వార్షికోత్సవం సందర్భంగా రుణాలు తీసుకున్న మహిళతో ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ మహిళ మోదీతో మాట్లాడుతూ తనకు హిందీ రాదని చెప్పారు. దీంతో పర్వాలేదు మీరు తెలుగులోనే మాట్లాడండి అంటూ మోదీ ప్రోత్సహించారు.
అనంతరం ఆమె తన నేపథ్యాన్ని వివరిస్తూ.. ‘2019లో కెనరా బ్యాంక్ రీజినల్ సెంటర్ ఫర్ ట్రైనింగ్‌లో జనపనార(జూట్) బ్యాగ్‌ల తయారీపై 13 రోజులు శిక్షణ తీసుకున్నాను. ఆ తర్వాత కెనరా బ్యాంకు వాళ్లే రూ.2 లక్షల ముద్రా రుణం ఇచ్చారు. 2019 నవంబరులో వ్యాపారం మొదలుపెట్టాను. క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించడంతో 2022లో బ్యాంకు అధికారులు రూ.9.5 లక్షల రుణం ఇచ్చారు. ప్రస్తుతం నా దగ్గర 15 మంది గృహిణులు పనిచేస్తున్నారు. వారంతా గ్రామీణ స్వయం ఉపాధి కేంద్రంలో శిక్షణ పొందిన వారే. ఒకప్పుడు అక్కడే శిక్షణ పొందిన నేను ఇప్పుడు నాలాంటి మహిళలకు బోధిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో రుణపడి ఉంటాను’’ అని ఆ మహిళ పేర్కొన్నారు. ఏపీ మహిళ ఎదుగుదలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.