Dr. Prabhavati: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి వింత సమాధానాలు

- సోమ, మంగళవారాల్లో డాక్టర్ ప్రభావతిని సుదీర్ఘంగా విచారించిన దర్యాప్తు అధికారులు
- 20 ప్రశ్నలు అడిగితే ముక్తసరిగా సమాధానాలు
- మర్చిపోయానని, రికార్డులు చూస్తేనే చెప్పగలనని సమాధానం
నాటి ఎంపీ, ప్రస్తుత శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి సమాధానాలు వింతగా ఉన్నాయి. గుంటూరు జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) విశ్రాంత సూపరింటెండెంట్ నీలం ప్రభావతి సోమ, మంగళవారాల్లో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. సోమవారం మధ్యాహ్నం నుంచి రాత్రి 8.45 గంటల వరకు దర్యాప్తు బృందం ఆమెను ప్రశ్నించింది. మొత్తం 20 ప్రశ్నలు అడిగితే వాటికి ఆమె ముక్తసరిగా సమాధానాలు ఇచ్చారు. తిరిగి నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మరోమారు సుదీర్ఘంగా ఆమెను ప్రశ్నించారు.
తాను గైనకాలజిస్టునని, ఆసుపత్రి సూపరింటెండెంట్ హోదాలో పనిచేసినప్పటికీ శరీరంలోని అంతర్గత గాయాలపై తనకు పెద్దగా అవగాహన లేదని డాక్టర్ ప్రభావతి చెప్పారు. తమ వైద్య సిబ్బంది రఘురామను పరిశీలించారని, గాయాలు ఏమీ లేవని నివేదిక ఇచ్చారని తెలిపారు. తాను దానిని చదివి సంతకం మాత్రమే చేశానని, అంతకుమించి తనకేమీ తెలియదని చెప్పుకొచ్చారు. తాను మర్చిపోయానని, ఇంతకుమించి ఇంకేమీ చెప్పలేనని వింత సమాధానాలు ఇచ్చారు. రికార్డులు పరిశీలిస్తేనే ఏమైనా చెప్పగలనని వివరించారు. ఇంతకుమించి వివరాలను రాబట్టేందుకు దర్యాప్తు అధికారులు ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ప్రతి ప్రశ్నకు ఆమె ముక్తసరిగానే సమాధానాలు ఇచ్చినట్టు తెలిసింది.