Chandrababu Naidu: 11, 12 తేదీల్లో ఏలూరు, కడప జిల్లాల్లో చంద్రబాబు పర్యటన... షెడ్యూల్ ఇదిగో!

- 11వ తేదీ ఉదయం ఆగిరిపల్లి మండలంలో చంద్రబాబు పర్యటన
- వడ్లమాను గ్రామంలో బీసీ వర్గాలతో సమావేశం అనంతరం ప్రజావేదికలో పాల్గొని ప్రసంగించనున్న చంద్రబాబు
- రాత్రికి కడప ఒంటిమిట్టలోని సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 11, 12 తేదీల్లో ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ జిల్లాల పర్యటనకు సంబంధించి సీఎంఓ షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
చంద్రబాబు తన పర్యటనలో భాగంగా ఈ నెల 11వ తేదీ శుక్రవారం ఉదయం పది గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామాన్ని చేరుకుంటారు. అక్కడ చంద్రబాబుకు స్థానిక ప్రజా ప్రతినిధులతో పాటు అధికారులు స్వాగతం పలుకుతారు. అనంతరం బీసీ వర్గాల ప్రజలతో వారి పని ప్రదేశంలోనే కలిసి మాట్లాడతారు. అనంతరం 11:30 గంటలకు స్థానిక ప్రజావేదిక వద్ద ప్రజలతో ఆయన ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ తర్వాత పార్టీ కార్యకర్తలు, నేతలతోనూ సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. ఆ తర్వాత తిరిగి 2:30 గంటలకు హెలికాప్టర్‌లో విజయవాడ (గన్నవరం ఎయిర్‌పోర్టు)కు చేరుకుంటారు.
గంట విరామం అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి సాయంత్రం 4:30 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 5 గంటలకు ఒంటిమిట్టలోని టీటీడీ వసతి గృహానికి చంద్రబాబు చేరుకుంటారు. తర్వాత ఆరు గంటలకు ఒంటిమిట్టలోని శ్రీకోదండ రామాలయానికి చేరుకుని ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఆ తర్వాత 6:45 గంటల నుంచి 8:30 గంటల వరకు జరగనున్న ఒంటిమిట్ట సీతారామ కల్యాణ మహోత్సవంలో చంద్రబాబు పాల్గొంటారు.
అనంతరం 8:40 గంటలకు అక్కడి టీటీడీ గెస్ట్ హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. మరునాడు అంటే 12వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు చంద్రబాబు కడప విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 10:30 గంటలకు గన్నవరం చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డుమార్గంలో బయలుదేరి ఉండవల్లి నివాసానికి సీఎం చేరుకుంటారు.