Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన పవన్ కల్యాణ్

- సింగపూర్ లో అగ్నిప్రమాదం
- గాయపడిన పవన్ తనయుడు మార్క్ శంకర్
- అందరి ఆశీస్సులతో తన కుమారుడు కోలుకుంటున్నాడన్న పవన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో గాయపడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ కుమారుడ్ని చూసేందుకు సింగపూర్ బయలుదేరారు. ప్రస్తుతం మార్క్ శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుమారుడు ప్రమాదానికి గురైన సమయంలో పవన్ కల్యాణ్ అల్లూరి జిల్లా పర్యటనలో ఉన్నారు. ఎంతో బాధలోనూ పర్యటన కొనసాగించిన పవన్... సాయంత్రం పర్యటన ముగిసిన తర్వాత విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లిన ఆయన... అక్కడ్నించి సింగపూర్ పయనమయ్యారు.
అందరి ఆశీస్సులతో మార్క్ కోలుకుంటున్నాడు
అగ్ని ప్రమాదంలో గాయపడిన తన కుమారుడు మార్క్ శంకర్ అందరి ఆశీస్సులతో కోలుకుంటున్నాడని పవన్ కల్యాణ్ వెల్లడించారు. తన బిడ్డ క్షేమం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ ఓ లేఖను విడుదల చేశారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన పెద్ద కుమారుడు అకీరా పుట్టినరోజు నాడే చిన్న కుమారుడికి ఇలా జరగడం బాధ కలిగించిందని అన్నారు.
