Manchu Manoj: ఇంటి వద్ద మంచు మనోజ్ కారు చోరీ.. కేసు నమోదు చేసిన పోలీసులు

- నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మంచు మనోజ్ డ్రైవర్
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- లభించిన ఆధారాల మేరకు చర్యలు తీసుకుంటామన్న ఎస్సై
సినీ నటుడు మంచు మనోజ్ నివాసం వద్ద కారు చోరీకి గురైన ఘటనపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు ఎస్సై హరికృష్ణారెడ్డి మాట్లాడుతూ, నార్సింగిలోని మనోజ్ ఇంటి నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కారును అపహరించారని తెలిపారు. వారం రోజుల క్రితం పోలీస్ స్టేషన్‌లో మంచు మనోజ్ డ్రైవర్ ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసి, లభించిన ఆధారాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
మంచు మనోజ్ గండిపేట మండలం నార్సింగిలోని ముప్పా విల్లాస్‌లో 13వ నెంబర్ విల్లాలో నివసిస్తున్నారు. ఏప్రిల్ 1వ తేదీన ఇంటి ముందు కారును నిలిపి ఉంచారు.
అర్ధరాత్రి సమయంలో కారు స్టార్ట్ అయిన శబ్దం వినిపించడంతో, భోజనం చేస్తున్న డ్రైవర్ వెంటనే బయటకు వచ్చి చూశాడు. అయితే, అప్పటికే దుండగులు కారును వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లిపోయారు.
సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కారును గుర్తించారు. రాజేంద్రనగర్ సమీపంలో కారును వదిలి వెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని న్యాయస్థానంలో డిపాజిట్ చేశారు.