Death in Uzbekistan: ఉజ్బెకిస్థాన్ లో మేఘాలయ ఉన్నతాధికారి మృతి

- మంగళవారం ఉదయం ఫోన్ చేస్తే స్పందించలేదన్న మేఘాలయ అధికారులు
- హోటల్ సిబ్బందికి సమాచారం అందించగా.. తలుపులు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించిన స్టాఫ్
- గదిలో బెడ్ పై నిర్జీవంగా పడి ఉన్నారని వెల్లడించిన హోటల్ సిబ్బంది
మేఘాలయ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ ఎండీ ఏ రాజి ఉజ్బెకిస్థాన్ లో మరణించారు. వ్యక్తిగత పర్యటనకు వెళ్లిన ఆయన ఈ నెల 4 నుంచి ఉజ్బెకిస్థాన్ రాజధాని బుకారా సిటీలో ఉంటున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం ఫోన్ చేయగా రాజి స్పందించలేదని మేఘాలయ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. దీంతో వెంటనే హోటల్ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు వివరించారు. గది తలుపులు బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించిన హోటల్ సిబ్బందికి బెడ్ పై రాజి నిర్జీవంగా పడి ఉండడం కనిపించిందని చెప్పారు.
ఈ విషయం తెలియడంతో రాజి భార్య ఉజ్బెకిస్థాన్ కు బయలుదేరారు. కాగా, రాజి మరణంపై ఉజ్బెకిస్థాన్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని మేఘాలయ ప్రభుత్వం పేర్కొంది. రాజి మృతదేహాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వివరించారు.
ప్రిన్సిపల్ సెక్రెటరీ రాజి ఆకస్మిక మరణంపై మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా విచారం వ్యక్తం చేశారు. విధి నిర్వహణ పట్ల ఆయనకున్న అంకితభావం వెలకట్టలేనిదని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని చెప్పారు. రాజి మరణంపై సీఎం సంగ్మా సంతాపం తెలిపారు. రాజి కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా సాయం అందిస్తామని ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా ట్వీట్ చేశారు.