Empuran: ‘మంజుమ్మల్ బాయ్స్’ రికార్డును బద్దలుగొట్టిన ఎంపురాన్.. మలయాళంలో సరికొత్త రికార్డు

- పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎల్ 2: ఎంపురాన్’
- ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల్లోనే రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లు
- ఈ ఏడాది ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో సినిమాగా రికార్డు
మలయళం సూపర్ స్టార్ మోహన్‌లాల్- డైరెక్టర్, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా అత్యధిక గ్రాస్ సాధించిన మలయాళం మూవీగా రికార్డులకెక్కింది. ఇప్పటి వరకు ఈ జాబితాలో ‘మంజుమ్మల్ బాయ్స్’ ఉండగా, ఇప్పుడీ రికార్డును కేవలం 9 రోజుల్లోనే ఎంపురాన్ సినిమా బద్దలుగొట్టింది. ఎంపురాన్ ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్లు సాధించింది.
చిదంబరం దర్శకత్వంలో వచ్చిన మంజుమ్మల్ బాయ్స్ సినిమా రూ. 241 (గ్రాస్) వసూళ్లు సాధించి మలయాళ చిత్రసీమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది. ఇప్పుడా రికార్డును కేవలం 9 రోజుల్లోనే ఎంపురాన్ బద్దలుగొట్టింది. ట్రాకింగ్ వెబ్‌సైట్ ‘సాక్నిల్’ ప్రకారం.. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో మూవీగానూ ఎంపురాన్ రికార్డులకెక్కింది.
పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమా ‘ఆడుజీవితం’ ఇండియాలో రూ. 167.0 కోట్లు, ‘2018’ సినిమా రూ. 110.50 కోట్లు సాధించాయి. తాజాగా ఎంపురాన్ మూవీ ఇప్పటి వరకు రూ. 106.50 కోట్లు సాధించి మూడో స్థానంలో నిలిచింది. త్వరలోనే ఇది ‘2018’ రికార్డును బద్దలుగొట్టి రెండో స్థానాన్ని ఆక్రమించనుంది.
కాగా, ఎంపురాన్ సినిమా ఈ ఏడాది ఇండియాలో అత్యధిక గ్రాస్ సాధించిన మూడో సినిమా గానూ రికార్డు సొంతం చేసుకుంది. విక్కీ కౌశల్ నటించిన ‘చావా’ సినిమా రూ. 800 కోట్లకుపైగా గ్రాస్ సాధించగా, విక్టరీ వెంకటేశ్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రూ. 255 గ్రాస్ వసూళ్లు రాబట్టింది.