Nawab Sheikh: భార్య బంగారం అమ్మేసి ‘బెడ్ కార్ట్’ వాహనాన్ని నిర్మించాడు... కానీ...!

- పశ్చిమ బెంగాల్ లో చక్రాల మంచం తయారు చేసిన కారు డ్రైవర్
- మోటారు వాహనాల చట్టం ఉల్లంఘనతో వాహనం సీజ్
- రూ.2.15 లక్షలు ఖర్చుతో వాహనం రూపొందించిన వైనం
పశ్చిమ బెంగాల్ లోని డోమ్‌కల్‌కు చెందిన 27 ఏళ్ల నవాబ్ షేక్ రూపొందించిన చక్రాల మంచం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, మోటారు వాహనాల చట్టం నిబంధనలను ఉల్లంఘించినందుకు పోలీసులు ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నవాబ్ తన భార్య నగలమ్మి రూ.2.15 లక్షలకు పైగా వెచ్చించి ఏడాదికి పైగా శ్రమించి ఈ చక్రాల మంచాన్ని రూపొదించాడు. ఇప్పుడది పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో ఆ దంపతులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
వృత్తిరీత్యా పూల్ కార్ డ్రైవర్ అయిన నవాబ్ షేక్, సాధారణ వాహనంలా నడిపే వీలున్న ఒక ప్రత్యేకమైన మంచం బండిని రూపొందించాడు. ఈ వింత ఆవిష్కరణలో 5x7 అడుగుల పరుపులు, దిండ్లు, స్టీరింగ్ వీల్, వెనుక అద్దాలు, బ్రేక్ సిస్టమ్‌తో సహా డ్రైవర్ సీటు ఉన్నాయి.
రాణీనగర్ మరియు డోమ్‌కల్ మధ్య ఈ ‘చక్రాల మంచం’ తిరుగుతుండటంతో భారీగా జనం గుమిగూడుతున్నారు, దీనివల్ల తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది.
ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి తనకు 1.5 సంవత్సరాలకు పైగా సమయం పట్టిందని నవాబ్ చెప్పాడు. "నేను వైరల్ కావాలని ఒకే ఒక కల ఉండేది" అని అతను అన్నాడు. "ఒక ఇంజిన్, స్టీరింగ్, ఇంధన ట్యాంక్ మరియు ఒక చిన్న కారు బాడీ వంటి విడిభాగాలను స్థానిక వర్క్‌షాప్ నుండి కొనుగోలు చేయడానికి, ఒక వడ్రంగితో చెక్క మంచం నిర్మాణం చేయడానికి దాదాపు రూ. 2.15 లక్షలు ఖర్చు చేశాను." అని తెలిపాడు.
నెలకి రూ. 9,000 మాత్రమే సంపాదించే నవాబ్ తన భార్య నగలమ్మి ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చాడు. ఈద్ పండుగకు వారం ముందు ఈ చక్రాల మంచం పూర్తయింది, రద్దీగా ఉండే రాష్ట్ర రహదారిపైకి రావద్దని పోలీసులు కోరినప్పటికీ, పండుగ రోజున దానిని ప్రారంభించాడు. అయితే, మోటారు వాహనాల చట్టం రూల్స్ కు ఆ మంచం వాహనం విరుద్ధంగా ఉందని, పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ప్రజా రహదారులపై మార్పులు చేసిన వాహనాన్ని నడపడానికి నవాబ్ వద్ద సరైన పత్రాలు లేదా అధికారుల నుండి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు, విచారణ ఫలితం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయి అని పోలీసులు పేర్కొన్నారు.
నవాబ్ భార్య మెహెర్ నెగర్ తన భర్త గురించి మాట్లాడుతూ, “మేమంతా అతన్ని చూసి గర్వపడ్డాం. అతను చాలా కష్టపడ్డాడు. పరిస్థితులు ఇలా వచ్చాయి. అతను కృంగిపోయాడు. ప్రభుత్వం అతనికి సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను” అని పేర్కొంది.
ఇక, ఈ మంచం బండి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నవాబ్ ఫేస్‌బుక్ పేజీలో ఈ వాహన వీడియోలకు 2.4 కోట్ల వ్యూస్ రాగా, ఒక బంగ్లాదేశీ ఛానెల్‌లో 20 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఎనిమిది గంటల తర్వాత ఒక బంగ్లాదేశీ మీడియా ఛానెల్ వీడియోను అప్‌లోడ్ చేయడంతో అతని ఆనందం ఆవిరైంది. కాపీరైట్ ఫిర్యాదులు రావడంతో నవాబ్ ఫేస్‌బుక్ ఖాతా బ్లాక్ అయింది.