Sri Dhar Babu: ఎమర్జింగ్ టెక్నాలజీస్ హబ్ గా తెలంగాణను తీర్చిదిద్దుతాం: టీజీ మంత్రి శ్రీధర్ బాబు

- భవిష్యత్తు మొత్తం 'ఏఐ'దే అన్న శ్రీధర్ బాబు
- సింగపూర్ కాన్సులేట్ జనరల్ బృందంతో భేటీ
- సింగపూర్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని వ్యాఖ్య
భవిష్యత్తు మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే అని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ నుంచి రెండు లక్షల మంది ఏఐ ఇంజినీర్లను తయారు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ నేతృత్వంలో ఆ దేశ ప్రతినిధులు ఈరోజు శ్రీధర్ బాబును సచివాలయంలో కలిశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వారికి శ్రీధర్ బాబు వివరించారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్ కు తెలంగాణను హబ్ గా మారుస్తున్నామని చెప్పారు. ఏఐ రంగంలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేలా తెలంగాణ యువతను తీర్చిదిద్దుతామని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలను నెలకొల్పుతున్నామని చెప్పారు.
ఏడాది వ్యవధిలోనే ఐటీ, హాస్పిటాలిటీతో పాటు ఇతర రంగాల్లో 70 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు ప్రారంభమయ్యాయని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటును కేవలం హైదరాబాద్ కే పరిమితం చేయకుండా... కరీంనగర్, వరంగల్ లాంటి నగరాలకు కూడా విస్తరిస్తున్నామని చెప్పారు. స్కిల్ డెవలప్ మెంట్, టెక్నాలజీ రంగాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.