Chandrababu Naidu: ముఖ్యంగా ఈ మూడు తగ్గిస్తే ఆరోగ్య సమస్యలు దరిచేరవు: సీఎం చంద్రబాబు

- వైద్యం, ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజంటేషన్
- చాలా వ్యాధుల నివారణకు డైట్ కంట్రోల్ తప్పనిసరి అని వెల్లడి
- ప్రజలు ప్రతి రోజు అరగంట వ్యాయామం చేయాలని సూచన
- వీలైతే ప్రాణాయామం కూడా చేయాలని పిలుపు
వైద్యం, ఆరోగ్యం, ఆహారం అంశంపై సీఎం చంద్రబాబు నేడు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనేక వ్యాధులు మన ఆహారపు అలవాట్ల కారణంగానే వస్తుంటాయని వెల్లడించారు. చాలా వ్యాధుల నివారణకు డైట్ కంట్రోల్ చేసుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. అదెలాగో కూడా చంద్రబాబు వివరించారు.
"నలుగురు సభ్యులు ఉన్న కుటుంబంలో ఉప్పు నెలకు 600 గ్రాముల మాత్రమే వాడాలి. వంట నూనె కూడా నెలకు 2 లీటర్లు మాత్రమే వాడాలి. చక్కెర కూడా నెలకు 3 కిలోలు వాడితే సరిపోతుంది. సమతుల్యమైన డైట్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా... ఉప్పు, వంట నూనె, చక్కెర తగ్గిస్తే ఆరోగ్య సమస్యలు దరిచేరవు.
ప్రతి రోజు అరగంట పాటు వ్యాయామం చేయాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నా. వీలైతే ప్రాణాయామం చేయాలని పిలుపునిస్తున్నా. ఇటీవల రూపొందించిన న్యూట్రిఫుల్ యాప్ కు స్కోచ్ అవార్డు లభించింది. ఈ యాప్ ను 4 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు" అని వివరించారు.
కాగా, రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, పలు రకాల జబ్బులపై ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చంద్రబాబు వివరించారు. అమరావతిలో గ్లోబల్ మెడిసిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకలు ఉండే ఆసుపత్రులు నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. కుప్పంలో డిజిటల్ హెల్త్ సర్వే సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు.
గుండె జబ్బులు, డయాబెటిస్, హైపర్ టెన్షన్, శ్వాసకోశ వ్యాధుల వంటి సమస్యలు కొన్ని చోట్ల విస్తృతంగా పెరుగుతున్నాయని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల్లో అధికంగా హైపర్ టెన్షన్ కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆహారపు అలవాట్ల వల్ల కొన్ని జిల్లాల్లో మధుమేహం ఎక్కువగా ఉందని వెల్లడించారు.