Shakil Bhai: బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ కెమికల్స్ రాశాడు... వికటించి ఆసుపత్రిపాలైన జనాలు!

బట్టతల కారణంగా కొందరు మగవాళ్లు ఇబ్బంది పడుతుంటారు. బట్టతలపై జుట్టు వస్తే ఎంత బాగుంటుంది అని అలాంటి వారు అనుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. అలాంటి వాళ్ల బలహీనతను ఆసరాగా చేసుకుని ఓ వ్యక్తి పలు కెమికల్స్ తో తనకు తెలిసిన వైద్యం చేశాడు. సీన్ కట్ చేస్తే... ఆ ట్రీట్ మెంట్ వికటించి జనాలు ఆసుపత్రిపాలయ్యారు.
ఢిల్లీకి చెందిన షకీల్ భాయ్ అనే వ్యక్తి బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేశాడు. ఓ బిగ్ బాస్ కంటెస్టెంట్ కు కూడా ఇలాగే జుట్టు మొలిపించానంటూ యాడ్స్ ఇచ్చాడు. అది నిజమేనని నమ్మిన జనాలు వందల సంఖ్యలో ఢిల్లీ ఓల్డ్ సిటీలోని ఫతే దర్వాజా వద్ద షకీల్ భాయ్ కి చెందిన బిగ్ బాస్ సెలూన్ వద్దకు తరలివచ్చారు.
అందరికీ గుండు గీసిన షకీల్ బాయ్... వారి తలపై కెమికల్స్ పూశాడు. అయితే, ఆ కెమికల్స్ వికటించడంతో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. జుట్టు కోసం పోతే కొత్త సమస్యలు వచ్చాయంటూ లబోదిబోమన్న బాధితులు చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరుతున్నారు.