Nara Lokesh: డ్రోన్ కెమెరాల సిత్రాలు... మంత్రి నారా లోకేశ్ ట్వీట్ వైరల్!

- నేరాల నియంత్రణకు కృష్ణా జిల్లా పోలీసుల డ్రోన్ కెమెరాల వినియోగం
- గుడివాడ పరిధిలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న యువకులను వెంబడించిన డ్రోన్
- వారు పరుగులు తీయగా పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన వైనం
- దీనిపై 'ఎక్స్' వేదికగా స్పందించిన మంత్రి నారా లోకేశ్
నేరాల నియంత్రణకు ఏపీలోని కృష్ణా జిల్లా పోలీసులు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నారు. తాజాగా గుడివాడ పరిధిలో ఓ ఇంజినీరింగ్ కాలేజీకి సమీపంలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న యువకులను డ్రోన్ వెంబడించింది. ఇది చూసి వారు పరుగులు తీయగా పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
దీనిపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్న వారిని చూస్తే జాలేస్తోంది. కానీ నేనేమీ చేయలేను. పోలీస్ డ్రోన్లు వాటి పని అవి చేస్తాయి" అని మంత్రి లోకేశ్ సెటైరికల్ గా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు డ్రోన్ చిత్రీకరించిన వీడియోను కూడా జోడించారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.