Ishant Sharma: ఇషాంత్ శర్మకు భారీ జరిమానా... కారణమిదే!

- నిన్న ఉప్పల్ వేదికగా తలపడ్డ గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్
- ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద ఇషాంత్‌కు బీసీసీఐ ఫైన్
- అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత... ఓ డీమెరిట్ పాయింట్ కూడా!
ఆదివారం ఉప్పల్ వేదికగా గుజరాత్ టైటాన్స్ (జీటీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్‌హెచ్) తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. అయితే, జీటీ బౌలర్ ఇషాంత్ శర్మకు బీసీసీఐ భారీ జరిమానా వేసింది. అతనికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. ఓ డీమెరిట్ పాయింట్ కూడా అతని ఖాతాలో చేరింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఇషాంత్ ఉల్లంఘించినట్లు బీసీసీఐ పేర్కొంది.
ఐపీఎల్‌లోని ఆర్టికల్ 2.2 ఉల్లంఘించడం ద్వారా లెవల్ 1 తప్పిదానికి ఇషాంత్ పాల్పడినట్లు తెలిపింది. క్రికెట్ సామగ్రిని కానీ, దుస్తుల్ని కానీ, గ్రౌండ్ ఎక్విప్మెంట్ పట్ల కానీ అమర్యాదరకంగా ప్రవర్తిస్తే... అప్పుడు ఆర్టికల్ 2.2 కింద జరిమానా విధిస్తారు. లెవల్ 1 అఫెన్స్‌ను ఇషాంత్ అంగీకరించాడు. మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ విధించిన జరిమానాను ఆమోదించాడు.
హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నెగ్గినా.. ఈ మ్యాచ్‌లో ఇషాంత్ భారీగానే రన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇషాంత్ ఇప్పటి వరకు ధారళంగా పరుగులు ఇస్తున్నాడు.
అతడు ఈ సీజన్‌లో మూడు మ్యాచుల్లో 8 ఓవర్లు వేసి 107 పరుగులు ఇచ్చాడు. కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టాడు. ఇక గుజరాత్ జట్టు మాత్రం ఈ సీజన్‌లో అద్భుతంగా ఆడుతోంది. ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన జీటీ... మూడు విజయాలు నమోదు చేసింది.