Donald Trump: పది సెకన్లలో రూ.20 లక్షల కోట్ల సంపద ఆవిరి.. ట్రంప్ టారిఫ్ ల దెబ్బకు మార్కెట్లు కుదేల్

--
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్ ల ప్రభావం స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. భారత స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. కేవలం పది సెకన్ల వ్యవధిలోనే మదుపర్ల సంపద రూ.20 లక్షల కోట్లు ఆవిరైపోయింది. ప్రపంచ దేశాల మధ్య టారిఫ్ వార్ ఆందోళనలు, మాంద్యం భయాలతో మార్కెట్లు పతనమయ్యాయి. సోమవారం ట్రేడింగ్ ఆరంభంలో సెన్సెక్స్ 3,939.68 పాయింట్లు (5.22 శాతం) కుంగింది. ఆ సమయంలో బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మార్కెట్ విలువ రూ. 20,16,293.53 కోట్లు తగ్గి.. రూ. 3,83,18,592.93 కోట్లకు చేరింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 10 శాతం మేర కుంగాయి.
కారణాలు ఇవేనంటున్న నిపుణులు..
- ట్రంప్ టారిఫ్‌లతో ద్రవ్యోల్బణం పెరిగి కార్పొరేట్ లాభాలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
- ఈ అంచనాలు వినియోగదారుల సెంటిమెంట్ పై ప్రతికూల ప్రభావం పడి ఆర్థిక వృద్ధి నెమ్మదించవచ్చని చెప్పారు.
- ఈ పరిణామాలతో మాంద్యం తప్పదనే భయాలు నెలకొన్నాయి.
- ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొనే అవకాశాలు 60 శాతం ఉందని జేపీ మోర్గాన్ అంచనా వేసింది.
- సుంకాలపై వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ మరోసారి స్పష్టం చేయడంతో మదుపర్లలో ఆందోళన నెలకొంది.
- ఈ అనిశ్చితుల నేపథ్యంలో ఏప్రిల్‌లో ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు.
- ఈ నెలలో ఇప్పటివరకు రూ.13,730 కోట్ల విలువైన ఈక్విటీలను ఎఫ్‌పీఐలు విక్రయించారు. ఈ అమ్మకాలు మరింత ఎక్కువగా ఉండొచ్చని నిపుణుల అంచనా.
- ద్రవ్య పరపతి విధాన సమీక్ష ప్రారంభించిన ఆర్ బీఐ ఈ నెల 9న నిర్ణయాలను వెల్లడించనుంది. ఈ నేపథ్యంలో మదుపర్లు విక్రయాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు బేర్‌మన్నాయి.