Kakanani Govardhan Reddy: కాకాణి చిన్న అల్లుడితో పాటు మరో ఇద్దరికి నోటీసులు

- క్వార్ట్స్ అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా కాకాణి
- ఇదే కేసులో కాకాణి చిన్న అల్లుడికి నోటీసులు
- ఈరోజు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్న పోలీసులు
క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. విచారణకు హాజరు కావాలంటూ మూడుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. ఆయన ఆచూకీ ఇప్పటివరకు పోలీసులకు లభించలేదు. తాజాగా ఈ కేసులో మరో ముగ్గురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వీరిలో కాకాణి గోవర్ధన్ రెడ్డి చిన్న అల్లుడు గోపాలకృష్ణారెడ్డితో పాటు కాంట్రాక్టర్ ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి, ఊరుబిండి చైతన్యలు ఉన్నారు.
నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో ఈరోజు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, విచారణకు హాజరయ్యేందుకు వీరు ముగ్గురూ సమయం కోరారు. క్వార్ట్జ్ అక్రమ తవ్వకం, అక్రమ రవాణా వ్యవహారంలో మరిన్ని వివరాలను రాబట్టేందుకు వీరిని విచారించాలనే నిర్ణయానికి పోలీసులు వచ్చినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్, క్వాష్ పిటిషన్ లను ఏపీ హైకోర్టులో కాకాణి దాఖలు చేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు ఈరోజు విచారించనుంది.