R Krishnaiah: వర్సిటీ భూముల వేలంపై ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు

- హెచ్‌సీయూ భూముల వేలం యోచనను ప్రభుత్వం తక్షణం విరమించుకోవాలన్న ఆర్.కృష్ణయ్య
- భూముల వేలం అంశంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని వెల్లడి
- వేలంలో పాల్గొనవద్దని రియల్టర్లకు హితవు
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) భూముల వేలంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం అప్పుల పాలైందని, ఆదాయ వనరులు తగ్గిపోయాయని విద్యాలయాల భూములు వేలం వేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
భూముల వేలం ఆలోచనను తక్షణం విరమించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూముల వేలంపై కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేల్లో కూడా వ్యతిరేకత ఉందని అన్నారు. ఈ విషయంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.
హెచ్‌సీయూ, ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో విద్యార్థి, యువజన సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హెచ్‌సీయూ ఆధీనంలో ఉన్న భూములు అన్యాక్రాంతం కాకుండా పోరాడతామని కృష్ణయ్య తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని, ఆ తర్వాత ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటుందని కావున రియల్టర్లు వేలంలో పాల్గొనవద్దని ఆయన హితవు పలికారు.
ఈ సమావేశంలో ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి.కిరణ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు నీల వెంకటేశ్, తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు సి.రాజేందర్, ఓయూ జేఏసీ అధ్యక్షుడు రాజు నేత తదితరులు పాల్గొన్నారు.