Donald Trump: ట్రంప్ తీరుపై నిరసనలతో హోరెత్తిన అమెరికా.. వీడియో ఇదిగో!

Hands Off Nationwide Protests Against Trump Administration
  • అమెరికాలోని 50 రాష్ట్రాల్లోనూ వెల్లెవెత్తిన నిరసనలు
  • లండన్, పారిస్ నగరాల్లోనూ ‘హ్యాండ్సాఫ్’ ఆందోళనలు
  • బిలియనీర్ అధికార దోపిడీని అంతం చేయాలని నినాదాలు
  • హక్కులు అందరికీ సమానంగా ఉండాలన్న నిరసనకారులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్‌లకు వ్యతిరేకంగా అమెరికాలోని 50 రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అమెరికన్ల హక్కులు, స్వేచ్ఛలపై దాడి జరుగుతోందంటూ ప్రజాస్వామ్య అనుకూల వాదులు నిర్వహించిన ఈ నిరసనల్లో లక్షలాదిమంది పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర రాజధానులు, సమాఖ్య భవనాలు, కాంగ్రెస్ కార్యాలయాలు, సామాజిక భద్రతా ప్రధాన కార్యాలయాలు, ఉద్యానవనాలు సహా పలుచోట్ల ‘హ్యాండ్సాఫ్’ నిరసనలు జరిగాయి.

‘ఈ బిలియనీర్ అధికార దోపిడీని అంతం చేయాలంటూ’ నిరసనకారులు నినదించారు. దాదాపు 6 లక్షల మంది ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. లండన్, పారిస్ వంటి ప్రధాన నగరాల్లోనూ నిరసనలు జరిగాయి. పౌరహక్కుల సంస్థలు, మహిళా హక్కుల సంఘాలు, కార్మిక సంఘాలు, ఎల్‌జీబీటీక్యూ ప్లస్, న్యాయవాదులు, సీనియర్ సిటిజన్లు తదితర 150 సంఘాల ఆధ్వర్యంలో 50 రాష్ట్రాల్లోని 1200కు పైగా ప్రాంతాల్లో నిరసనలు జరిగినట్టు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంస్థల్లో ఒకటైన ‘ఇండివిజిబుల్’ తెలిపింది. 

ట్రంప్ పరిపాలనను మస్క్ టేకోవర్ చేయడాన్ని అంతం చేయడం, విపరీత అవినీతిని అంతం చేయడం, సామాజిక భద్రత, శ్రామిక ప్రజలు ఆధారపడే ఇతర కార్యక్రమాలకు సమాఖ్య నిధులు తగ్గించడాన్ని ఆపడం, వలసదారులు, ట్రాన్స్ ప్రజలు, ఇతర వర్గాలపై దాడులను అంతం చేయడం వంటివి తమ ప్రధాన డిమాండ్లు అని నిరసనకారులు తెలిపారు. 

వాషింగ్టన్ డీసీలో జరిగిన హ్యాండ్స్ ఆఫ్ నిరసనల్లో మేరీల్యాండ్‌కు చెందిన డెమోక్రటిక్ ప్రతినిధి జామీ రాస్కిన్ సహా పలువురు ప్రతినిధులు మాట్లాడారు. స్వలింగ సంపర్కుల పట్ల ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును మానవ హక్కుల గ్రూప్ అధ్యక్షుడు కెల్లీ రాబిన్సన్ తప్పుబట్టారు. గౌరవం, భద్రత, స్వేచ్ఛ కొంతమందికి కాకుండా అందరికీ లభించాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.
Donald Trump
Elon Musk
US Protests
Hands Off Protests
American Rights
Civil Rights
Political Protests
Washington DC
Jamie Raskin
Kelly Robinson

More Telugu News