Satyavardhan Kidnap Case: నేపాల్‌లో సత్యవర్థన్ కిడ్నాప్ కేసు నిందితులు

- కొమ్మా కోటేశ్వరరావు సహా మరికొందరు నేపాల్‌లో తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం
- అక్కడి నుంచే స్నేహితులకు ఫోన్లు
- కేసు వివరాలు, పోలీసుల కదలికలపై ఆరా తీస్తున్న నిందితులు
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మిగిలిన నిందితులు నేపాల్‌లో ఉన్నట్టు పోలీసులు పసిగట్టారు. ఈ కేసులో వల్లభనేని వంశీ ముఖ్య అనుచరుడు కొమ్మా కోటేశ్వరరావు అలియాస్ కోట్లు సహా మరికొందరు అరెస్ట్ కావాల్సి ఉంది. వీరంతా ఇప్పుడు నేపాల్‌లో ఉన్నట్టు పోలీసులు సమాచారం సేకరించారు. కిడ్నాప్ కేసులో ఏ-5గా ఉన్న ఓలుపల్లి మోహనరంగారావు అలియాస్ రంగాను గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కిడ్నాప్ కేసులో పీటీ వారెంట్‌పై పోలీసులు అతడిని కోర్టులో హాజరు పరచనున్నారు.
కాగా, కిడ్నాప్ కేసులో వంశీ పాత్ర ఎంతో కోట్లుదీ అంతే. వంశీ అరెస్ట్ అయిన మరుక్షణం రంగా, కోట్లు ఇద్దరూ ఊరు దాటేశారు. అయితే, రంగా ఇటీవల ఏలూరులో సీఐడీ పోలీసులకు దొరికిపోయాడు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా ఆరుగురిలో విశాఖకు చెందిన ఇద్దరు నిందితులు శ్రీకాకుళం వైపు పారిపోయారు. ఇక, నేపాల్‌లో తలదాచుకుంటున్న కోట్లుతోపాటు మరో ముగ్గురు అక్కడి నుంచే స్నేహితులకు ఫోన్లు చేసి కేసు విషయాన్ని, పోలీసుల కదలికలను ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో వారి ఆచూకీని గుర్తించిన పోలీసులు నేపాల్‌లో వారు ఎక్కడ తలదాచుకున్నారన్న విషయమై ఆరా తీస్తున్నారు.