Talking Crow: వరుసలు కలుపుతూ మాట్లాడుతున్న కాకి.. వీడియో ఇదిగో!

- మహరాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో ఘటన
- కాకా, దీదీ అంటూ పిలుస్తున్న కాకి
- చూసేందుకు తరలివస్తున్న జనం
చిలుకలు, గోరింకలు మాట్లాడటం గురించి మనం విన్నాం. చూశాం కూడా. కానీ ఓ కాకి మాట్లాడటం మీరెప్పుడైనా చూశారా? మాట్లాడటమే కాదు.. వరుసలు కలిపి పిలుస్తోంది. ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తోంది. మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లా గార్గావ్‌లో కనిపించిన వింత ఇది.
గ్రామానికి చెందిన ఓ ఆదివాసీ కుటుంబానికి కొన్ని రోజుల క్రితం గాయపడి ఇంటి ఆవరణలో పడివున్న కాకి కనిపించింది. దీంతో దానిని చేరదీసి సపర్యలు చేశారు. దీంతో అది కోలుకుంది. కాకి పూర్తిగా కోలుకున్నప్పటికీ అది ఆ కుటుంబాన్ని విడిచి వెళ్లలేదు. ఇంట్లో వారు మాట్లాడే మాటలను పలుకుతూ వారిలో ఒకరిగా మారిపోయింది. ‘పాపా’, ‘కాకా’, ‘దీదీ’ అని పిలవడంతోపాటు ‘క్యా కర్ రహే హో?’ ( ఏం చేస్తున్నారు?) అని ఇంట్లోని వారిని ప్రశ్నిస్తోంది. ఈ వింతను చూసేందుకు ఇరుగుపొరుగు ఎగబడుతున్నారు.