Telangana: నీటి వాటాలపై ఏపీతో గట్టిగా తేల్చుకునేందుకు సిద్ధమైన తెలంగాణ

- సుదీర్ఘకాలంగా తెలంగాణ, ఏపీ మధ్య నీటి వాటాలపై వివాదం
- సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ భేటీ
- అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ
కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌తో నెలకొన్న వివాదంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఏపీ తన వాటాకు మించి నీటిని వాడుకుంటుందనే ఆరోపణల నేపథ్యంలో, కృష్ణా ట్రిబ్యునల్‌లో గట్టిగా వాదనలు వినిపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌తో భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా చర్చలు జరిపారు.
హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఏప్రిల్ 15, 16, 17 తేదీల్లో సుప్రీంకోర్టులో జరగనున్న విచారణలో తెలంగాణ తన వాదనను బలంగా వినిపించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా నీటి పంపకాల విషయంలో స్పష్టత రాకపోవడంతో, తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది.
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాపై ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే న్యాయపరంగా పోరాడి తమ హక్కులను కాపాడుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ తన వాదనలతో ఏపీ వాదనలకు దీటుగా బదులిస్తారని తెలంగాణ ధీమాగా ఉంది.