Nadeendla Manohar: మంత్రి నాదెండ్లకు డిప్యూటీ సీఎం పుట్టిన రోజు శుభాకాంక్షలు

––
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు సుఖ సంతోషాలు, సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. బాధ్యతల నిర్వహణలో ఓర్పుతో, నేర్పుగా వ్యవహరించే అనుభవశీలి, సోదర సమానులు నాదెండ్ల మనోహర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని పవన్ చెప్పారు.
గత పాలకులు పక్కదారి పట్టించిన ప్రజాపంపిణీ వ్యవస్థను నాదెండ్ల చక్కదిద్దుతున్నారని తెలిపారు. పీడీఎస్ మాఫియాపై కఠినంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోగా రైతులకు సొమ్ము చెల్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నారని వివరించారు. ఖరీఫ్ సీజన్లో విజయవంతంగా ధాన్యం సేకరించారని పవన్ కల్యాణ్ చెప్పారు. నిత్యావసరాల ధరలు అదుపులోకి తీసుకురావడం, దీపం-2 పథకం అమలు రాష్ట్రంలోని మహిళలకు సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.
రాష్ట్ర మంత్రిగా తన కర్తవ్య నిర్వహణను బాధ్యతాయుతంగా, చిత్తశుద్ధితో చేస్తున్నారని కొనియాడారు. పార్టీ శ్రేణులను, నాయకులను అనుసంధానించుకుంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్లడంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఆయన నిర్వర్తించిన పాత్ర మరచిపోలేనిదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు.
