RK Roja: రోజా అవినీతిపై విచారణ జరుగుతోంది: శాప్ ఛైర్మన్ రవినాయుడు

- మాజీ మంత్రి ఆర్కే రోజాపై శ్యాప్ ఛైర్మన్ రవి నాయుడు కీలక వ్యాఖ్యలు
- పేద క్రీడాకారులకు చెందిన నిధులను దోచుకున్నారని ఆరోపణ
- క్రీడా నిధుల దుర్వినియోగంపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందన్న రవి నాయుడు
- రోజా త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమన్న రవి నాయుడు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత వైకాపా ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై విచారణ కొనసాగుతున్న విషయం విదితమే. ఇప్పటికే గనుల శాఖ, ఎక్సైజ్ శాఖ తదితర విభాగాల్లో జరిగిన అక్రమాలపై కేసులు నమోదు చేసి ఏపీ సీఐడీ ద్వారా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదే క్రమంలో రోజా పర్యాటక, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని తెదేపా నాయకులు ఆరోపిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో వైకాపా మహిళా నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై తెదేపా నేత, శాప్ ఛైర్మన్ రవి నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆమె మంత్రిగా పనిచేసిన కాలంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పేద క్రీడాకారుల డబ్బులను అప్పనంగా కాజేశారని ఆయన విమర్శించారు. నిరుపేద క్రీడాకారులకు చెందిన కోట్ల రూపాయలను రోజా దోచుకున్నారని ఆరోపించారు. ఆమె అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని తెలిపారు. త్వరలో ఆమె జైలుకు వెళ్లడం ఖాయమని రవి నాయుడు అన్నారు.
పొరుగు రాష్ట్రం చెన్నైలో ఉండే రోజాకు ఇక్కడి అభివృద్ధి, సంక్షేమం గురించి ఏమి తెలుసునని ఆయన మండిపడ్డారు. తిరుపతి జిల్లాలో వైకాపా నేతలు పగటి వేషగాళ్లలా తయారయ్యారని రవి నాయుడు విమర్శించారు.