Jofra Archer: అర్చర్ దెబ్బకు పంజాబ్ కింగ్స్ విలవిల.. రాజస్థాన్ అ‘ద్వితీయ’ విజయం

Archers Masterclass Leads Rajasthan Royals to Victory
  • రెండు వరుస ఓటముల తర్వాత రాజస్థాన్ రెండు వరుస విజయాలు
  • బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్ఠిగా రాణించిన జట్టు
  • ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా జోఫ్రో అర్చర్
వరుసగా రెండు ఓటములతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను ప్రారంభించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆ తర్వాత పుంజుకుంది. వరుసగా రెండో విజయాన్ని సాధించి ఆత్మవిశ్వాసం నింపుకుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో రాణించి పంజాబ్ కింగ్స్‌ను మట్టి కరిపించి రెండో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. చండీగఢ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 50 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్ మెరుపులతో 205 పరుగులు చేసింది.

అనంతరం 206 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్‌ను రాజస్థాన్ బౌలర్లు, ముఖ్యంగా జోఫ్రా అర్చర్ బెంబేలెత్తించాడు. తొలి ఓవర్ తొలి బంతికే ప్రియాన్ష్ ఆర్యను  పెవిలియన్ పంపి తొలి దెబ్బ తీశాడు. అది మొదలు వికెట్ల పతనం కొనసాగింది. 43 పరుగులకే నాలుగు కీలక వికెట్లు పడిపోయిన వేళ నేహాల్ వధేరా, గ్లెన్ మ్యాక్స్‌వెల్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. నేహాల్ 41 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు, మ్యాక్స్‌వెల్ 21 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 30 పరుగులు చేశారు. వీరిద్దరూ ఔటైన తర్వాత వికెట్ల పతనం మళ్లీ మొదలైంది. చివరికి 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. రాజస్థాన్ బౌలర్లలో అర్చర్ 3, సందీప్ శర్మ, మహీష్ తీక్షణ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.

అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. జైస్వాల్ 45 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 67 పరుగులు చేయగా, కెప్టెన్ సంజు శాంసన్ 26 బంతుల్లో 6 ఫోర్లతో 38 పరుగులు, రియాన్ పరాగ్ 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 43 పరుగులు (నాటౌట్) చేయడంతో రాజస్థాన్ భారీ స్కోరు చేయగలిగింది. నితీశ్ రాణా 12, హెట్మెయిర్ 20 పరుగులు చేశారు. ధ్రువ్ జురెల్ 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 3 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జోఫ్రా అర్చర్‌కి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఐపీఎల్‌లో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు జరగనుంది.
Jofra Archer
Rajasthan Royals
Punjab Kings
IPL 2023
IPL Match
Cricket
Yashasvi Jaiswal
Sanju Samson
Ryan Parag
Nehal Wadhera
Glenn Maxwell

More Telugu News