Etala Rajender: మంత్రి శ్రీధర్ బాబును కలిసిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

- మల్కాజ్‌గిరి పార్లమెంటు పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి
- తాగునీటి సరఫరా, రోడ్లు సరిగ్గా లేవని మంత్రి దృష్టికి తెచ్చిన ఎంపీ
- హైడ్రా పేరిట డబ్బులు వసూలు చేస్తున్న వారిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి
తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబుతో మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇంఛార్జి అయిన శ్రీధర్ బాబును ఆయన కోరారు. నియోజకవర్గంలో తాగునీటి సరఫరా సరిగా లేదని, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, చెరువులు మురికి కూపాలుగా మారాయని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
అలాగే, హైడ్రా పేరిట డబ్బులు వసూలు చేస్తున్న బ్లాక్‌మెయిలర్లపై దృష్టి సారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చిన్న దేవాలయాలను కూడా దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావడంతో పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వెల్లడించారు. నగరానికి నలువైపులా డంప్ యార్డులు ఉండాలని కోరారు. నగరంలోని చెత్తనంతటినీ బాలాజీనగర్ పంపిస్తే అక్కడి ప్రజల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ఆయన కోరారు.