Karumanchi Prasad: చంద్రబాబు పిలుపుతో పీ4కి అనూహ్య స్పందన... ముందుకువచ్చిన ప్రసాద్ సీడ్స్ అధినేత

Unexpected Response to Chandrababu P4 Call as Prasad Seeds Chairman Donates for Lift Irrigation Project

  • కొమ్మమూరు ఎత్తిపోతల పథకానికి ప్రసాద్ సీడ్స్ రూ. 10 కోట్ల విరాళం
  • 5,315 ఎకరాలకు సాగునీరు, తాగునీటి సమస్య పరిష్కారం
  • త్వరలో డీపీఆర్ సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని అధికారులకు సీఎం ఆదేశం

పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన 'పీ4' కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. పేదలకు సహాయం చేసేందుకు సంపన్నులు, పారిశ్రామికవేత్తలు ముందువస్తున్నారు. ఈ క్రమంలో, చంద్రబాబు పీ4 పిలుపును అందుకుని గుంటూరు జిల్లాకు చెందిన ఒక పారిశ్రామికవేత్త తన సొంత నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మించడానికి ముందుకు వచ్చారు.

కాకమాను మండలంలోని రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొమ్మమూరు కాలువ ద్వారా నీటి సౌకర్యం ఉన్నప్పటికీ, చివరి భూములకు నీరు చేరడం లేదు. ఈ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మిస్తే రైతుల కష్టాలు తీరుతాయని భావించిన ప్రసాద్ సీడ్స్ అధినేత ప్రసాద్, పీ4 కార్యక్రమానికి స్పందించి తనవంతు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

ప్రసాద్ సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తమ ఆలోచనను తెలియజేశారు. కొమ్మమూరు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రూ.10 కోట్లు విరాళంగా ఇస్తామని ప్రకటించారు. దీని ద్వారా తమ స్వగ్రామమైన కాకమానుతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సాగునీటి సమస్య పరిష్కారం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాలుగా విత్తన వ్యాపారంలో ఉన్న కారుమంచి ప్రసాద్, 1995 నుంచి ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు సహాయం చేస్తున్నారు.

కారుమంచి ప్రసాద్ చేసిన విరాళం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చంద్రబాబు అన్నారు. కొమ్మమూరు ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కోసం వెంటనే డీపీఆర్ సిద్ధం చేయాలని, అనుమతులు మంజూరు చేయాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. ప్రసాద్ అందించే ఆర్థిక సహాయంతో అధికారులు సమన్వయం చేసుకుని లిఫ్ట్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. తన ఆలోచనలకు అనుగుణంగా ప్రజలు ముందుకు రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ముఖ్యమంత్రి అన్నారు.

43 కిలోమీటర్ల పొడవున్న కొమ్మమూరు కాలువలో చివరి 10 కిలోమీటర్ల మేర భూములకు సాగునీరు సరిగా అందడం లేదు. ఈ సమస్యను పరిష్కరించడానికి కాకమాను దగ్గర కొమ్మమూరు కాలువపై లిఫ్ట్ నిర్మించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే కాకమాను, బీకే పాలెం, అప్పాపురం, గరికపాడు, కొండపాతూరు గ్రామాల్లోని సుమారు 5,315 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 

అలాగే, కాకమాను మండలంలో తాగునీటి సమస్య కూడా తీరుతుంది. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 10 కిలోమీటర్ల పొడవునా చివరి ఆయకట్టు వరకు 100 క్యూసెక్కుల నీరు ప్రవహించేలా 100 అడుగుల వెడల్పుతో కాలువను అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రసాద్ వ్యక్తిగతంగా సహాయం చేయడానికి ముందుకు రావడంతో ప్రభుత్వం కూడా అవసరమైన నిధులు వెచ్చించి పనులు పూర్తి చేయనుంది.

Karumanchi Prasad
Prasad Seeds
Chandrababu Naidu
P4 Program
Lift Irrigation Project
Kammavaripalem
Guntur District
Andhra Pradesh
Agriculture
Water scarcity
  • Loading...

More Telugu News