Jagan Mohan Reddy: తల్లిపై కేసు వేసిన కొడుకుగా, మేనల్లుడు, మేనకోడలు ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ నిలిచిపోతారు: షర్మిల

- సరస్వతి పవర్ షేర్ల ఎంవోయూపై జగన్ సంతకాలు చేశారన్న షర్మిల
- సరస్వతి పవర్ షేర్లను విజయమ్మకు గిఫ్ట్ డీడ్ గా ఇచ్చాడని వెల్లడి
- తనకు ఒక్క ఆస్తి కూడా ఇవ్వలేదన్న షర్మిల
తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సరస్వతి పవర్ షేర్ల ఎంవోయూపై జగన్ స్వయంగా సంతకాలు చేశారని చెప్పారు. ఇప్పటి వరకు ఒక్క ఆస్తి కూడా తనకు జగన్ ఇవ్వలేదని తెలిపారు. తమ తల్లి విజయమ్మకు సరస్వతి పవర్ షేర్లను జగన్ గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చారని... ఇచ్చిన షేర్లు మళ్లీ తనకే కావాలని పట్టుబడుతున్నారని మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
కన్నతల్లిపై కేసు వేసిన కొడుకుగా, మేనల్లుడు, మేనకోడలు ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు.
వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డివంటి వారిని అడ్డం పెట్టుకుని తమపై నిందలు వేశారని విమర్శించారు. జగన్ కు ఆత్మీయులకన్నా ఆస్తులే ముఖ్యమనుకుంటున్నానని చెప్పారు. జగన్ కు విశ్వసనీయత ఉందో? లేదో? వైసీపీ వాళ్లు ఆలోచించాలని సూచించారు.
జగన్ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడిందని షర్మిల అన్నారు. వక్ఫ్ బిల్లులో డబుల్ స్టాండర్డ్స్ చూపించారని విమర్శించారు. ఎన్డీయేకు బలం ఉన్న లోక్ సభలో బిల్లును వ్యతిరేకించి... కీలకమైన రాజ్యసభలో మాత్రం అనుకూలంగా ఓటు వేసిందని మండిపడ్డారు. జగన్ సూచనలతో రాజ్యసభలో వైసీపీ ఎంపీలు బిల్లుకు మద్దతు తెలిపారని చెప్పారు. జగన్ తీరును జాతీయ మీడియా ఎండగడుతోందని అన్నారు.