Mohammad Yunus: బంధాలు బలహీనపడ్డ వేళ... మోదీతో భేటీ అయిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మొహమ్మద్ యూనస్

Bangladesh Interim Leader Meets Modi

  • హసీనా దిగిపోయిన తర్వాత బలహీనపడ్డ భారత్-బంగ్లాదేశ్ బంధాలు
  • చైనా, పాకిస్థాన్ కు దగ్గరవుతున్న బంగ్లాదేశ్
  • బ్యాంకాక్ లో భేటీ అయిన మోదీ, యూనస్

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగిపోయిన తర్వాత భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు పూర్తిగా దిగజారిపోయాయి. చైనా, పాకిస్థాన్ కు అనుకూలంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మొహమ్మద్ యూనస్ స్టాండ్ తీసుకున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతో యూనస్ భేటీ అయ్యారు. బ్యాంకాక్ లో జరుగుతున్న బిమ్ స్టెక్ సమ్మిట్ సందర్భంగా వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వీరితో పాటు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహదారు అజిత్ దోవల్ కూడా ఉన్నారు. 

బంగ్లాదేశ్ పాలనా బాధ్యతలను యూనస్ తీసుకున్న తర్వాత మోదీ-యూనస్ ల మధ్య సమావేశం జరగడం ఇదే తొలిసారి. చైనాకు బంగ్లాదేశ్ దగ్గరవుతున్న సమయంలో జరిగిన ఈ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. యూనస్ ఇటీవలి చైనా పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు భారత్ కు ఆగ్రహం తెప్పించాయి. భారత్ లోని ఈశాన్య రాష్టాలకు సముద్ర తీరం లేదని... సముద్రానికి వారు చేరుకునే అవకాశం లేదని చెప్పారు. బంగాళాఖాతం తీర ప్రాంతం బంగ్లాదేశ్ కు ఉందని... చైనా తన కార్యకలాపాలను విస్తృత పరుచుకోవడానికి బంగ్లాదేశ్ అనువైన దేశమని అన్నారు. 

యూనస్ వ్యాఖ్యలపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలు చికెన్ నెక్ కారిడార్ ద్వారా మిగిలిన భారత్ భూభాగంతో కనెక్ట్ అయి ఉన్నాయని చెప్పారు. ఈ రాష్ట్రాలకు రైలు, రోడ్ కనెక్టివిటీని మరింత పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో రవాణా వ్యవస్థను మెరుగు పరచడం అంత ఈజీ కాదని... ఎన్నో ఇంజినీరింగ్ సమస్యలు ఉన్నాయని... కానీ, చిత్తశుద్ధితో దేన్నైనా సాధించవచ్చని చెప్పారు. యూనస్ చేసిన వ్యాఖ్యలను తేలికగా తీసుకోకూడదని... ఆయన వ్యాఖ్యల వెనుక సుదీర్ఘమైన అజెండా ఉందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మోదీతో యూనస్ సమావేశం ఆసక్తికరంగా మారింది.

Mohammad Yunus
Bangladesh
India
Modi
Narendra Modi
BIMSTEC Summit
China
Bangladesh-India Relations
Himanta Biswa Sharma
South Asia
  • Loading...

More Telugu News