Mamata Banerjee: మమతా బెనర్జీకి భారీ ఎదురుదెబ్బ.. 25 వేలమంది టీచర్ల నియామకాల రద్దు

Mamata Banerjee Faces Setback 25000 Teacher Appointments Cancelled

  • హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు
  • సంవత్సరాలుగా టీచర్లు తీసుకుంటున్న వేతనాలు వెనక్కి ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టీకరణ
  • నియామక ప్రక్రియ మొత్తం లోపభూయిష్టంగా ఉందని వ్యాఖ్య
  • బెంగాల్‌లో విద్యావ్యవస్థ కుప్పకూలాలని ప్రతిపక్ష బీజేపీ, సీపీఎం కోరుకుంటున్నాయన్న మమత

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు భారీ షాకిచ్చింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌ పరిధిలో ఉద్యోగాలు పొందిన 25 వేల మందికి పైగా టీచర్లు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. నియామక ప్రక్రియ మొత్తం లోపభూయిష్టంగా, కళంకితమైనదిగా ఉందని పేర్కొంది. దానికి విశ్వసనీయత, చట్టబద్ధత లేదని స్పష్టం చేసింది. 

హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. నియామకాలు మోసపూరితంగా జరిగాయని స్పష్టం చేసింది. నియామక ప్రక్రియలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, అందులో విశ్వసనీయత, చట్టబద్ధత లోపించిందని పేర్కొంది. కళంకితులుగా తేలిన అభ్యర్థులు సంవత్సరాలుగా పొందిన వేతనాలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే, వారి నియామకాలను మాత్రం రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. 

హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసిన మమతా బెనర్జీ ప్రభుత్వం.. కళంకిత అభ్యర్థులు, కళంకితం కాని అభ్యర్థులను వేర్వేరుగా చూడాలని కోరింది. అయితే, నియామక ప్రక్రియ ప్రతి దశలోనూ మభ్యపెట్టే, కప్పిపుచ్చే చర్యలు ఉన్నందున ఎవరు కళంకితులో, ఎవరు కాదో నిర్ధారించడం కష్టంగా మారిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కాగా, 2016లో మమత ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఎంపిక పరీక్షకు 23 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. అయితే, 24,640 ఖాళీలకు 25,753 మందికి నియామక పత్రాలు జారీ చేశారు. దీంతో అక్రమ నియామకాల కోసమే అదనంగా సూపర్‌న్యూమరిక్‌ పోస్టులు సృష్టించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

సుప్రీంకోర్టు తీర్పుపై మమత స్పందించారు. బెంగాల్‌లో విద్యావ్యవస్థ కుప్పకూలాలని ప్రతిపక్ష బీజేపీ, సీపీఎం కోరుకుంటున్నాయా? అని ప్రశ్నించారు. మోసపూరితంగా నియామకాలు పొందిన కొందరి వల్ల అభ్యర్థులందరినీ శిక్షించడం సరికాదని పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడినప్పుడు ఆయనను బదిలీతో సరిపుచ్చారని, మరి ఉపాధ్యాయులను బదిలీతో ఎందుకు సరిపుచ్చరని మమత ప్రశ్నించారు. 

Mamata Banerjee
West Bengal
Supreme Court
Teacher Appointments
School Service Commission
Calcutta High Court
Illegal Appointments
Corruption
India
25000 Teachers
  • Loading...

More Telugu News