Kodali Nani: మరో నెల రోజుల పాటు ముంబైలోనే కొడాలి నాని

- 2న ముంబైలో దాదాపు 10 గంటలపాటు నానికి శస్త్రచికిత్స
- ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న నాని
- ఆయన అవయవాలన్నీ బాగానే స్పందిస్తున్నాయన్న వైద్యులు
వైసీపీ నాయకుడు, కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) మరో నెల రోజులపాటు ముంబైలోనే ఉండనున్నారు. వారం రోజులుగా ఆయన గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆయన గుండెలో సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. మూడు వాల్వులలో సమస్యలు ఉన్నాయని నిర్ధారించారు. స్టంట్ వేయడం కానీ, బైపాస్ సర్జరీ కానీ చేయాలని వైద్యులు సూచించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబైకి తరలించారు.
ముంబైలోని ఏషియన్ హార్ట్‌కేర్ ఇనిస్టిట్యూట్‌లో మొన్న (2న) నిర్వహించిన బైపాస్ సర్జరీ విజయవంతమైంది. ఆసుపత్రి చీఫ్ సర్జన్ రమాకాంత్ పాండే దాదాపు 8 నుంచి 10 గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులపాటు ఆయన ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు. ఆయన అవయవాలన్నీ సరిగానే పనిచేస్తున్నాయని, మరో నెల రోజులపాటు ఆయన ముంబైలోనే ఉంటారని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మండలి హనుమంతరావు తెలిపారు.