Nithyananda: బొలీవియాలో నిత్యానంద భూ దందా... వెయ్యేళ్ల లీజుకు విఫలయత్నం

Nithyanandas Kaailasa and the Bolivia Land Controversy

  • బొలీవియాలో నిత్యానంద లీలలు... 20 మంది అరెస్ట్
  • భూమి లీజుకు నిత్యానంద అనుచరుల యత్నాలు
  • స్థానిక తెగలతో ఒప్పందాలు
  • భూమి లీజు యత్నాలను భగ్నం చేసిన బొలీవియా ప్రభుత్వం

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి మరోసారి వార్తల్లోకెక్కారు. లైంగిక వేధింపుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ దేశం విడిచి పారిపోయిన నిత్యానంద, ఇప్పుడు బొలీవియాలో భూ కుంభకోణానికి తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశం కాని దేశంలో తన 'కైలాస' సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు నిత్యానంద ప్రయత్నించిన వైనం బయటపడింది.

బొలీవియాలోని భూములను తేలిగ్గా చేజిక్కించుకునేందుకు నిత్యానంద అనుచరులు చేసిన ప్రయత్నాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. నిత్యానంద ప్రతినిధులు స్థానిక తెగలతో భూమి లీజుకు ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం చేయగా, ఈ విషయం వెలుగులోకి రావడంతో బొలీవియా ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు 'కైలాస'తో సంబంధం ఉన్న 20 మందిని అరెస్టు చేసి వారి స్వదేశాలకు పంపించారు.

నివేదికల ప్రకారం, కైలాసకు చెందిన వ్యక్తులు బొలీవియాలో పర్యటించి, కార్చిచ్చు సమయంలో స్థానిక ప్రజలకు సహాయం చేశారు. ఆ తరువాత వారి కన్ను అక్కడి భూములపై పడింది. స్థానిక తెగలను మభ్యపెట్టి భూములను లీజుకు తీసుకునేందుకు ప్రయత్నించారు. 

కైలాస ప్రతినిధులు బొలీవియా అధ్యక్షుడు లూయిస్ ఆర్స్‌తో ఫోటోలు దిగడం గమనార్హం. ఒకానొక సమయంలో, ఒక స్థానిక తెగ ప్రతినిధి 2 లక్షల డాలర్లు చెల్లిస్తే ఢిల్లీకి దాదాపు మూడు రెట్ల విస్తీర్ణంలో ఉన్న భూమిని 25 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వడానికి అంగీకరించాడు. అయితే కైలాస ప్రతినిధులు ఆ భూమిని వెయ్యి సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని, గగనతల వినియోగం మరియు సహజ వనరుల తవ్వకాలకు కూడా అనుమతి ఇవ్వాలని కోరడంతో అసలు విషయం బయటపడింది.

బొలీవియాలోని ఒక వార్తాపత్రిక ఈ వ్యవహారంపై కథనం ప్రచురించడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వెంటనే స్పందించిన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కైలాసతో సంబంధం ఉన్న 20 మందిని అరెస్టు చేసి, స్థానికులతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసింది. నిందితులు పర్యాటకులుగా బొలీవియాలోకి ప్రవేశించి స్థానికులతో ఒప్పందాలు చేసుకున్నారని ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు.

నిత్యానంద దేశం విడిచి పారిపోయిన తరువాత 'కైలాస' అనే ప్రాంతంలో ఆశ్రమాన్ని స్థాపించినట్లు వార్తలు వచ్చాయి. అయితే కైలాస ఎక్కడ ఉందనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఈక్వెడార్ సమీపంలో ఒక చిన్న దీవిని కొనుగోలు చేసి దానికి కైలాసం అని పేరు పెట్టినట్లు గతంలో నిత్యానంద ప్రకటించాడు. ఒక కేసు విషయమై తమిళనాడు ప్రభుత్వం కూడా నిత్యానంద ఈక్వెడార్‌లో ఉన్నట్లు హైకోర్టుకు తెలిపింది. 

Nithyananda
Bolivia
Nithyananda land scam
Kaailasa
Bolivia land deal
Nithyananda arrest
Spiritual leader
controversial guru
Luis Arce
Ecuador
  • Loading...

More Telugu News