Venkatesh Iyer: ఈడెన్ గార్డెన్స్ లో సన్ రైజర్స్ ముందు భారీ టార్గెట్

- కోల్ కతాలో ఐపీఎల్ మ్యాచ్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
- 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసిన కేకేఆర్
- వెంకటేశ్ అయ్యర్, రఘువంశీ ఫిఫ్టీలు
- దూకుడుగా ఆడిన అజింక్యా రహానే, రింకూ సింగ్
కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ముందు భారీ లక్ష్యం నిలిచింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసింది.
వెంకటేశ్ అయ్యర్, ఆంగ్ క్రిష్ రఘువంశీ అర్ధసెంచరీలతో రాణించారు. కెప్టెన్ అజింక్యా రహానే, రింకూ సింగ్ కూడా దూకుడుగా ఆడారు. వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 60 పరుగులు చేయగా, రఘువంశీ 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో సరిగ్గా 50 పరుగులు చేసి అవుటయ్యాడు.
అంతకుముందు, టాస్ గెలిచిన సన్ రైజర్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ ఆరంభంలో తడబాటుకు గురైన కేకేఆర్ జట్టు 16 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్ (1), సునీల్ నరైన్ (7) సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. ఈ దశలో కెప్టెన్ అజింక్యా రహానే 27 బంతుల్లో 1 ఫోర్, 4 భారీ సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో దిగువన వచ్చిన రింకూ సింగ్ 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 32 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇన్నింగ్స్ చివరి బంతికి ఆండ్రీ రసెల్ (1) రనౌటయ్యాడు.
సన్ రైజర్స్ బౌలర్లలో షమీ 1, కమిన్స్ 1, జీషన్ అన్సారీ 1, కమిందు మెండిస్ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఫీల్డింగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పరుగులు భారీగా లీకయ్యాయి.