పార్టీ ఫిరాయింపుల పిటిషన్లపై తీర్పు రిజర్వ్

––
బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్ ఆగస్టీన్‌ జార్జ్‌ మసీహ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కేసులో అసెంబ్లీ సెక్రటరీ తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం వాదనలు వినిపించారు. ఈ కేసులో ఎనిమిది వారాల్లో తుది తీర్పు వెలువరించాలని ఆర్యమా సుందరం ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.

మరోవైపు, ఎమ్మెల్యే అనర్హత కేసులో స్పీకర్ కు గడువు విధించిన సింగిల్‌ బెంచ్‌ తీర్పు సరికాదని అభిషేక్ మను సింఘ్వీ మరోసారి కోర్టుకు తెలిపారు. స్పీకర్‌ నిర్ణయానికి కాల పరిమితి విధించే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తీర్పులు లేవన్నారు. సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసిన డివిజన్‌ బెంచ్‌ తీర్పు సరైనదేనని సమర్థించారు. ఈ విషయంపై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ స్పందిస్తూ ‘మీ దృష్టిలో రీజనబుల్‌ టైమ్‌ అంటే ఏమిటి?’ అని సింఘ్వీని ప్రశ్నించారు. న్యాయవాదులు ఇలాంటి కేసుల విషయంలో వ్యవహరించే విధానం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు.


More Telugu News