పుకార్ల‌పై 'ది ప్యార‌డైజ్' టీమ్ ఆగ్ర‌హం.. 'ఎక్స్' వేదిక‌గా ఘాటు స్పందన

  • నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో 'ది ప్యార‌డైజ్'
  • ఇప్ప‌టికే విడుదలైన‌ మూవీ గ్లింప్స్ కు భారీ స్పంద‌న‌
  • గ‌త కొన్ని రోజులుగా ఈ సినిమాపై పుకార్లు షికారు 
  • మూవీ స్క్రిప్ట్ ప‌ట్ల నాని అసంతృప్తి.. బ‌డ్జెట్ ఎక్కువ కావ‌డంతో సినిమా ఆగిపోయిందంటూ రూమ‌ర్స్‌
  • ఇలాంటి పుకార్లు సృష్టించేవారిని జోక‌ర్ల‌తో పోలుస్తూ మూవీ టీమ్‌ ట్వీట్
నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న రెండో చిత్రం 'ది ప్యార‌డైజ్'. ఇప్ప‌టికే ఈ మూవీ గ్లింప్స్ విడుదలై సంచ‌ల‌నం సృష్టించింది. గ్లింప్స్‌కు భారీ స్పంద‌న వ‌చ్చింది. అయితే, గ‌త కొన్ని రోజులుగా ఈ సినిమాపై పుకార్లు షికారు చేస్తున్నాయి. మూవీ స్క్రిప్ట్ ప‌ట్ల నాని అసంతృప్తిగా ఉన్నార‌ని, బ‌డ్జెట్ కూడా ఎక్కువ కావ‌డంతో సినిమా ఆగిపోయిందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. దీనిపై మూవీ టీమ్ తాజాగా 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఘాటుగా స్పందించింది. ఇలాంటి పుకార్లు సృష్టించేవారిని జోక‌ర్ల‌తో పోలుస్తూ ట్వీట్ చేసింది. 

" 'ది ప్యార‌డైజ్' ప‌నులు అనుకున్న విధంగానే జ‌రుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ సరైన మార్గంలోనే ఉంది. నిశ్చింతగా ఉండండి. దీన్ని ఎంత గొప్ప‌గా తీర్చిదిద్దుతున్నారో మీరు త్వ‌ర‌లోనే చూస్తారు. ఈలోగా మీకు వీలైనంత ఎక్కువ రూమ‌ర్స్ క్రియేట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే... 'గజరాజు నడిస్తే..గజ్జి కుక్కలు అరుస్తాయి.. మేము ఈ సినిమాపై అభిమానులు చూపిస్తున్న ప్రేమ‌ను గ‌మ‌నిస్తున్నాం. 

అలాగే నిరాధార‌మైన వార్త‌లు ప్ర‌చారం చేస్తున్న వారిని గ‌మ‌నిస్తున్నాం. వాట‌న్నిటితో ఒక శ‌క్తిగా ఎదుగుతాం. టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే ది ప్యార‌డైజ్ గ‌ర్వించే సినిమా అవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. త‌ప్పుడు వార్త‌ల‌ను ప్ర‌చారం చేసేవారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆశిస్తున్నాం. ఫ్యాన్స్ అంతా గ‌ర్వ‌ప‌డే సినిమాతో నాని మీ ముందుకు వ‌స్తార‌ని వాగ్దానం చేస్తున్నాం" అని మూవీ టీమ్ ట్వీట్ చేసింది.  


More Telugu News