అందుకే ముంబ‌యి నుంచి గోవాకు మారుతున్నా: యశస్వి జైస్వాల్

  • ముంబ‌యి నుంచి గోవాకు మారుతూ జైస్వాల్ సంచ‌ల‌న నిర్ణ‌యం 
  • ఇప్పటికే ఎంసీఏ నుంచి ఎన్ఓసీ కూడా తీసుకున్న వైనం
  • ముంబ‌యి నుంచి గోవా జ‌ట్టుకు మార‌డంపై తాజాగా స్ప‌ష్ట‌త‌
  • జీసీఏ త‌న‌కు లీడ‌ర్‌షిప్ రోల్ ఆఫ‌ర్ చేసిన‌ట్లు వెల్ల‌డి
టీమిండియా యువ ఓపెన‌ర్‌ యశస్వి జైస్వాల్ తాను ముంబ‌యి నుంచి గోవాకు మారుతూ తీసుకున్న ఆకస్మిక నిర్ణయం దేశవ్యాప్తంగా దేశీయ క్రికెట్‌లో సంచలనం సృష్టించింది. ముంబ‌యి నుంచి గోవాకు వెళ్లాలనే తన కోరికను తెలియజేస్తూ జైస్వాల్ మంగళవారం ముంబ‌యి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు లేఖ రాశాడు. అటు ఎంసీఏ కూడా అతనికి నిరభ్యంతర ధృవపత్రం (ఎన్‌ఓసీ) ఇచ్చింది. దాంతో  23 ఏళ్ల ఎడమచేతి వాటం బ్యాట‌ర్ 2025-26 సీజన్ నుంచి గోవా తరఫున బ‌రిలోకి దిగ‌నున్నాడు. 

అయితే, తాను ముంబ‌యి నుంచి గోవా జ‌ట్టుకు మార‌డంపై యశస్వి జైస్వాల్ తాజాగా స్ప‌ష్ట‌త‌నిచ్చాడు. గోవా క్రికెట్ అసోసియేష‌న్ (జీసీఏ) త‌న‌కు లీడ‌ర్‌షిప్ రోల్ ఆఫ‌ర్ చేసింద‌ని, అందుకే ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోనున్న‌ట్లు తెలిపాడు. 

ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో జైస్వాల్ మాట్లాడుతూ... "ఇది నాకు చాలా కఠినమైన నిర్ణయం. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే అందుకు కార‌ణం ముంబ‌యినే. ఈ నగరం నాకు చాలా ఇచ్చింది. నా జీవితాంతం నేను ఎంసీఏకి రుణపడి ఉంటాను. గోవా నాకు కొత్త అవకాశాన్ని ఇచ్చింది. నాకు లీడ‌ర్‌షిప్ రోల్ ఆఫ‌ర్ చేసింది. అయితే, నా మొదటి లక్ష్యం భారత్ తరఫున బాగా రాణించడమే. ఆ త‌ర్వాత గోవా త‌ర‌ఫున కూడా బాగా ఆడి ఆ జ‌ట్టును ఉన్న‌త స్థాయికి తీసుకెళ్ల‌డానికి ప్రయత్నిస్తాను. ఇది నాకు వచ్చిన ముఖ్యమైన అవకాశం" అని జైస్వాల్ అన్నాడు. ఇక గతంలో సిద్ధేశ్ లాడ్, అర్జున్ టెండూల్కర్ కూడా ముంబయి నుంచి గోవాకు మారారు. వారు రంజీల్లో గోవాకు ప్రాతినిధ్యం వహించారు.

కాగా, భారత ఆటగాళ్లందరూ అంత‌ర్జాతీయ టోర్నీలు ఆడ‌న‌ప్పుడు త‌ప్ప‌నిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఇటీవ‌ల నిబంధ‌న‌లు తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఈ ఆదేశాలను కఠినంగా అమలు చేయ‌డంతో జనవరి 23-25 తేదీలలో జరిగిన రంజీ ట్రోఫీ గ్రూప్-ఏ లీగ్ రౌండ్ మ్యాచ్‌లో జైస్వాల్ చివరిగా ముంబ‌యి తరఫున జమ్మూకశ్మీర్‌తో ఆడాడు. అలాగే టీమిండియా సీనియ‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ కూడా చాలా కాలం త‌ర్వాత రంజీ బ‌రిలోకి దిగిన సంగ‌తి తెలిసిందే. 


More Telugu News