Telangana Government: 400 ఎకరాల భూమిపై 20 ఏళ్ల నాటి కీలక డాక్యుమెంట్లను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Govt Releases 20 Year Old Documents on 400 Acre Land Dispute
  • 400 ఎకరాలపై టీజీఐఐసీ, హెచ్‌సీయూ మధ్య వివాదం
  • 2004 నాటి పత్రాలను విడుదల చేసిన ప్రభుత్వం
  • కంచ గచ్చిబౌలి భూమిని హెచ్‌సీయూ ప్రభుత్వానికి అప్పగించినట్లుగా డాక్యుమెంట్
  • గోపనపల్లిలోని భూమిని ప్రభుత్వం హెచ్‌సీయూకి ఇచ్చినట్లుగా మరో డాక్యుమెంట్
హైదరాబాద్‌లోని కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం ఇరవై ఏళ్ల క్రితం నాటి రెండు కీలక డాక్యుమెంట్లను విడుదల చేసింది. 400 ఎకరాల భూమి విషయంలో టీజీఐఐసీ, హెచ్‌సీయూ మధ్య వివాదం నెలకొంది. ఈ భూమి ప్రభుత్వానిదేనని టీజీఐఐసీ ప్రకటించగా, దీనిని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ఖండించింది. హెచ్‌సీయూకు చెందిన కొందరు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండు డాక్యుమెంట్లను విడుదల చేసింది. ఈ డాక్యుమెంట్ల ప్రకారం 2004 ఫిబ్రవరి 3వ తేదీన 534.28 ఎకరాల భూమిని హెచ్‌సీయూ ప్రభుత్వానికి అప్పగించింది. అదే రోజు గోపనపల్లిలోని 397.16 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం హెచ్‌సీయూకు కేటాయించింది. సంబంధిత డాక్యుమెంట్లపై హెచ్‌సీయూ నాటి రిజిస్ట్రార్, శేరిలింగంపల్లి నాటి రెవెన్యూ అధికారులు సంతకాలు చేశారు.

ఇద్దరిని అరెస్టు చేశాం: మాదాపూర్ డీసీపీ

భూముల వ్యవహారంలో ఆందోళన నిర్వహించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు మాదాపూర్ డీసీపీ వెల్లడించారు. నిన్న మధ్యాహ్నం మూడున్నర గంటలకు టీజీఐఐసీకి చెందిన 400 ఎకరాల భూమిని చదును చేసేందుకు అధికారులు వచ్చారని, అదే సమయంలో హెచ్‌సీయూకు చెందిన కొందరు ఆందోళనకు దిగారని ఆయన తెలిపారు.

జేసీబీని అడ్డుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. పోలీసులపై పలువురు దాడి చేయడంతో మాదాపూర్ ఏసీపీకి గాయాలయ్యాయని అన్నారు. మొత్తం 53 మందిని అదుపులోకి తీసుకున్నామని, ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేసినట్లు చెప్పారు. హెచ్‌సీయూకు సంబంధం లేని ఇద్దరిని అరెస్టు చేశామని తెలిపారు.
Telangana Government
Gachibowli land dispute
TGIIIC
HCU
Land Acquisition
Hyderabad Central University
20-year-old documents
Police arrests
Land Allotment
Property Dispute

More Telugu News