పశ్చిమ హైదరాబాద్ ఢిల్లీలా కాలుష్య ప్రాంతంగా మారే ప్రమాదముంది: హెచ్‌సీయూపై కేటీఆర్
- నగరానికి హెచ్‌సీయూ పరిసరాలే ఆక్సిజన్ ఇచ్చే ప్రాంతాలుగా ఉన్నాయన్న కేటీఆర్
- 400 ఎకరాల్లో చెట్లు కొట్టివేస్తే భవిష్యత్తులో ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారుతుందని ఆందోళన
- ఏం హక్కు ఉందని భూములు విక్రయిస్తున్నారని ఆగ్రహం
400 ఎకరాల భూమిని విక్రయించి రూ. 30 వేల కోట్లు సంపాదించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ భూములను విక్రయించడానికి వారికి ఏం హక్కు ఉందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫ్యూచర్ సిటీ కోసం 45 వేల ఎకరాలను సిద్ధం చేస్తున్నప్పుడు, ఈ 400 ఎకరాలు ఎందుకని నిలదీశారు. హైకోర్టులో పిటిషన్ విచారణకు రాకముందే భూమిని చదును చేస్తున్నారని ఆరోపించారు. కోర్టుకు వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భూములను చదును చేస్తోందని మండిపడ్డారు.
వందల సంఖ్యలో పోలీసులను మోహరించి, అడ్డుకునే వారిని కొడుతూ, మహిళల పట్ల దుశ్శాసన పర్వాన్ని తలపిస్తూ భూమిని చదును చేస్తున్నారని ఆరోపించారు. అక్కడ జరుగుతున్న అన్యాయం తమకు కనపడటం లేదా, వినపడటం లేదా అని నెమళ్లు సహా వివిధ జంతువులు ప్రశ్నిస్తున్నాయని అన్నారు. హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.