Girija Vyas: హారతి ఇస్తుండగా మంటలు అంటుకుని కేంద్ర మాజీ మంత్రికి తీవ్ర గాయాలు

Former Union Minister Girija Vyas Suffers Severe Burns in Fire Accident
  • గంగౌర్ పండుగ వేళ అగ్నిప్రమాదానికి గురైన గిరిజా వ్యాస్
  • దుపట్టాకు మంటలు అంటుకుని గాయాలు
  • ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు
ప్రముఖ కాంగ్రెస్ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి గిరిజా వ్యాస్ రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో తన నివాసంలో అగ్ని ప్రమాదానికి గురయ్యారు. గంగౌర్ పండుగ వేళ పూజ అనంతరం హారతి ఇస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె దుస్తులకు మంటలు అంటుకున్నాయి. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఉదయ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించి, మెరుగైన చికిత్స కోసం అహ్మదాబాద్‌కు తరలించాలని సూచించారు.

ఈ ఘటనపై గిరిజా వ్యాస్ సోదరుడు గోపాల్ శర్మ స్పందిస్తూ, హారతి సమయంలో ఆమె దుపట్టాకు మంటలు అంటుకున్నాయని, వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. గిరిజా వ్యాస్ త్వరగా కోలుకోవాలని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన తన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఒక ప్రకటన విడుదల చేశారు.

గిరిజా వ్యాస్ గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో అనేక కీలక పదవులు నిర్వహించారు. ఆమె 1985 నుంచి 1990 వరకు ఎమ్మెల్యేగా, రాజస్థాన్ పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. 1991లో తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత 1996, 1999 సంవత్సరాలలో ఉదయపూర్ నియోజకవర్గం నుంచి, 2009లో చిత్తోర్‌గఢ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ (NCW) ఛైర్ పర్సన్‌గా కూడా ఆమె సేవలు అందించారు.
Girija Vyas
Rajasthan
Udaipur
fire accident
Congress leader
former Union Minister
Gopal Sharma
Ashok Gehlot
National Commission for Women
NCW

More Telugu News