మయన్మార్ భూకంపం.. వేగంగా స్పందించిన భారత్

  • 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ పంపించిన ప్రభుత్వం
  • ఆహార పదార్థాలు, అత్యవసర మందులు, టెంట్లతో బయల్దేరిన విమానం
  • మరింత సాయం అందించేందుకు సిద్ధమని ప్రకటన
పెను భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్ ను ఆదుకోవడంలో భారత ప్రభుత్వం తక్షణమే స్పందించింది. శుక్రవారం సంభవించిన భూకంపం కారణంగా మయన్మార్ లో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు 15 టన్నుల సహాయక సామగ్రిని పంపించింది. హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి శనివారం ఉదయమే విమానం బయలుదేరి వెళ్లింది. భూకంప బాధితుల కోసం ఆహార పదార్థాలు, మందులు, దుప్పట్లు, తాత్కాలికంగా నివసించేందుకు టెంట్లు, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్ ల్యాంప్స్, జెనరేటర్లను తీసుకువెళ్లింది.

భారీ భవనాలు కూలిపోవడంతో గాయపడిన వారికి చికిత్స అందించడానికి అవసరమైన మందులను కూడా పంపించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ విమానం శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మయన్మార్ లోని యాంగాన్ విమానాశ్రయంలో దిగిందని భారత దౌత్యవేత్త రణధీర్ జైశ్వాల్ ట్వీట్ చేశారు. మానవతా సహాయంగా ఈ విమానాన్ని పంపామని, అవసరాన్ని బట్టి మరింత సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.


More Telugu News