తెలంగాణ అసెంబ్లీలో డీలిమిటేషన్ తీర్మానం... స్పందించిన స్టాలిన్

  • చెన్నైలో లేవనెత్తిన ఆకాంక్ష హైదరాబాద్‌లో నెరవేరిందన్న స్టాలిన్
  • పారదర్శక డీలిమిటేషన్... న్యాయం, సమానత్వం, సమాఖ్య స్ఫూర్తిని చాటుతుందని వెల్లడి
  • తెలంగాణ దారిలో మిగతా రాష్ట్రాలు నడుస్తాయని ఆకాంక్షించిన స్టాలిన్
లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ తెలంగాణ శాసనసభ చేసిన తీర్మానంపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం. కే. స్టాలిన్ స్పందించారు. చెన్నైలో లేవనెత్తిన ఆకాంక్ష హైదరాబాద్‌లో నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. పారదర్శక డీలిమిటేషన్... న్యాయం, సమానత్వం, సమాఖ్య స్ఫూర్తిని చాటుతుందని వ్యాఖ్యానించారు.

కేంద్రం ప్రవేశపెట్టాలని భావిస్తున్న డీలిమిటేషన్ చట్టం ప్రజాస్వామ్య సమతుల్యతను దెబ్బతీసే చర్యను బలోపేతం చేస్తుందని ఆయన విమర్శించారు. చెన్నైలో అఖిలపక్ష సమావేశం, తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆరంభం మాత్రమేనని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం బాటను మిగతా రాష్ట్రాలు కూడా అనుసరిస్తాయని ఆకాంక్షించారు.

హైదరాబాద్‌లో రెండో సంయుక్త కార్యాచరణ కమిటీ సమావేశం జరుగుతుందని స్టాలిన్ తెలిపారు. దేశ భవిష్యత్తును అన్యాయంగా మార్చడాన్ని తాము అనుమతించబోమని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయడం ఒక మైలురాయి అని ఆయన పేర్కొన్నారు.


More Telugu News