మా ప్రభుత్వంలో మాయ మాటలు చెప్పేవాళ్లు లేరు: పోలవరం నిర్వాసితులతో సీఎం చంద్రబాబు

  • నేడు పోలవరంలో చంద్రబాబు పర్యటన
  • నిర్వాసితులతో ముఖాముఖి
  • నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా
"పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి. ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 2026 డిసెంబర్‌కే పునరావాసం కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని అధికారులను కోరుతున్నా. అందుకు అవసరమైన సిబ్బందిని ఇస్తాం" అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు గురువారం ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం నిర్వాసితులతో ముఖాముఖిలో పాల్గొన్నారు. 
    
ఖర్చుచేసే ప్రతిపైసా నిర్వాసితులకే చెందాలి... 
2014లో తాము అధికారంలోకి రాకముందు నిర్వాసితులకు చాలా తక్కువ పరిహారం ఇచ్చార‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక రూ.4,311 కోట్ల పరిహారం చెల్లించిన విష‌యాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. కానీ 2019లో వచ్చిన ప్రభుత్వం ఆ ఐదేళ్లలో ఒక్కసారి కూడా నిర్వాసితుల గురించి ఆలోచించడం కానీ, పట్టించుకోవడం కానీ చేయలేదని విమ‌ర్శించారు. కనీసం వారి సమస్యల పట్ల ఆలోచించిన దాఖలాలు కూడా లేవ‌న్నారు. 

పోలవరం పూర్తవ్వాలంటే తెలంగాణలోని 7 ముంపు మండలాలు ఏపీలో విలీనం చేయాలని అప్పట్లో ప్రధాని మోదీని ఒప్పించిన‌ట్లు తెలిపారు. వీలైనంత వరకు నిర్వాసితుల‌కు న్యాయం చేసి ఆదుకోవాలని ముందుకెళ్లామ‌న్నారు. 

రూ.400 కోట్లతో డయాఫ్రం వాల్ కడితే వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కొట్టుకుపోయింద‌ని తెలిపారు. ఇప్పుడు మళ్లీ రూ.990 కోట్లతో కొత్త డయాఫ్రంవాల్ నిర్మిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ప్రజాధనాన్ని విచ్చలవిడిగా వృథా చేశార‌ని మండిప‌డ్డారు. ప్రజల సొమ్మును ప్రజల కోసమే ఖర్చు చేయాలి తప్ప దుర్వినియోగం చేయకూడద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు.

గత పాలకులు పోలవరం నిధులు మళ్లించారు...
తాను సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని పనిచేశాన‌ని, 33 సార్లు ప్రాజెక్టును సందర్శించాన‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధులను గత పాలకులు ఇతర అవసరాలకు మళ్లించిన విష‌యాన్ని గుర్తు చేశారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తయి ఉంటే నిర్వాసితులు ఈ పాటికే స్థిరపడేవార‌ని తెలిపారు. పోలవరం హైడల్ ప్రాజెక్టు  పూర్తయి ఉంటే రూ. 2,500 కోట్ల ఆదాయం వచ్చేద‌న్నారు. దాన్ని కూడా ఆలస్యం చేయడంతో అదనపు భారం పడి ఖర్చు కూడా పెరిగిపోయింద‌ని తెలిపారు. 

మా ప్రభుత్వంలో మాయమాటలు చెప్పేవారు లేరు...
పునరావాసం కల్పించిన తర్వాత నిర్వాసితుల‌ ఆదాయ మార్గాలు, జీవన ప్రమాణాలు పెరగడానికి చర్యలు తీసుకుంటామ‌ని చంద్ర‌బాబు అన్నారు. నిర్వాసితులు ధైర్యంగా ఉండాలని, ఇది మీ ప్రభుత్వం... మనందరి ప్రభుత్వమ‌న్నారు. మంచిని మంచిగా చెబితే మరింత మంచి జరుగుతుంద‌ని తెలిపారు. మంచి చేసిన వారికి సహకరించకపోతే తప్పే అవుతుంద‌ని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వంలో దళారులు, దొంగలు, మోసగాళ్లు, మాయ మాటలు చెప్పేవారు అస్సలు లేర‌ని తెలిపారు. ప్రాజెక్టు కోసం గిరిజనులు ఎక్కువ త్యాగం చేశార‌ని, ఇళ్లు నిర్మించుకునే గిరిజనులకు రూ.75 వేలు అదనంగా త‌మ‌ కూటమి ప్రభుత్వం అందిస్తుంద‌ని సీఎం చంద్రబాబు అన్నారు. 




More Telugu News