మ‌రికాసేప‌ట్లో ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌... డేవిడ్ వార్న‌ర్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌!

  • ఉప్ప‌ల్ వేదిక‌గా ఎస్ఆర్‌హెచ్, ఎల్ఎస్ జీ మ్యాచ్‌
  • ఇవాళ హైద‌రాబాద్ 300 ర‌న్స్ చేస్తుందా? అంటూ 'ఎక్స్' వేదిక‌గా ప్ర‌శ్నించిన వార్న‌ర్‌
  • అభిషేక్ 100 ర‌న్స్‌, ట్రావిస్ హెడ్ 20 బంతుల్లో 50 పరుగులు చేస్తార‌ని మాజీ ప్లేయ‌ర్‌ అంచ‌నా
మ‌రికాసేప‌ట్లో ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్), ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్ జీ) త‌ల‌ప‌డ‌నున్న విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో స‌న్‌రైజ‌ర్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశాడు. ఇవాళ హైద‌రాబాద్ జ‌ట్టు 300 ర‌న్స్ చేస్తుందా? అంటూ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఈ మాజీ క్రికెట‌ర్ ప్ర‌శ్నించారు. 

"ఈరోజు రాత్రి సన్‌రైజర్స్ 300 పరుగులు చేయగలదా? ఈ మ్యాచ్ చేసేందుకు ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నాను. అభిషేక్ శ‌ర్మ 100 ప‌రుగులు, ట్రావిస్ హెడ్ 20 బంతుల్లో 50 పరుగులు చేస్తార‌ని నా అంచ‌నా అంటూ వార్న‌ర్ ట్వీట్‌లో రాసుకొచ్చాడు. కాగా, గ‌తంలో వార్న‌ర్ కెప్టెన్సీలో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్టు ఒక ఐపీఎల్ టైటిల్ గెలిచిన విష‌యం తెలిసిందే. 

ఇక గ‌తేడాది ల‌క్నోతో ఉప్ప‌ల్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్ లో ఎస్ఆర్‌హెచ్ ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్ స్వైర విహారం చేసిన విష‌యం తెలిసిందే. ఎల్ఎస్ జీ నిర్దేశించిన 166 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఈ ద్వ‌యం కేవ‌లం 9.4 ఓవ‌ర్ల‌లోనే ఛేదించింది. అభిషేక్ 28 బంతుల్లో 75 ప‌రుగులు చేయ‌గా... హెడ్ 30 బంతుల్లో 89 ర‌న్స్ చేసి, ల‌క్నో బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోశారు. ఈరోజు కూడా అదే రిపీట్ కావాల‌ని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు కోరుకుంటున్నారు. 

కాగా, ఎస్ఆర్‌హెచ్ ఈ ఏడాది ఐపీఎల్ సీజ‌న్‌ను భారీ విజ‌యంతో శుభారంభం చేసిన సంగ‌తి తెలిసిందే. రాజ‌స్థాన్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో 44 ప‌రుగుల తేడాతో గెలిచింది. అలాగే టోర్నీ చ‌రిత్ర‌లోనే రెండో అత్య‌ధిక స్కోరు (286)ను కూడా న‌మోదు చేసింది. దీంతో ఇవాళ కూడా రాజీవ్ గాంధీ స్టేడియంలో భారీ స్కోర్ న‌మోదు కావ‌డం ఖాయ‌మ‌ని విశ్లేషకులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  


More Telugu News