Bandi Sanjay: డిజిటల్ అరెస్టుల కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది: బండి సంజయ్

Central Govt Takes Action Against Digital Arrests Bandi Sanjay

  • లోక్ సభలో వెల్లడించిన కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్
  • ఇప్పటివరకు 7.81 లక్షల సిమ్ కార్డులు డీయాక్టివేట్
  •  83 వేల వాట్సాప్ ఖాతాలు నిలిపివేత
  •  2,08,469 ఐఎమ్‌ఈఐలను బ్లాక్ చేసిన ప్రభుత్వం

డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారి ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు తీసుకున్న చర్యల్లో భాగంగా ఫిబ్రవరి 7.81 లక్షల సిమ్ కార్డులను, 83 వేల వాట్సాప్ ఖాతాలను నిలిపివేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లోక్‌సభలో వెల్లడించారు.

నకిలీ పత్రాలతో సిమ్ కార్డులు పొంది డిజిటల్ మోసాలకు పాల్పడుతున్న వారి ఆగడాలను అరికట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని బండి సంజయ్ తెలిపారు. అంతేకాకుండా, 2,08,469 ఐఎమ్‌ఈఐలను కూడా ప్రభుత్వం నిలిపివేసిందని అన్నారు.

ప్రతి ఫోన్‌కు కేటాయించే ప్రత్యేక సంఖ్య ఐఎమ్‌ఈఐ అని, డిజిటల్ అరెస్టుల కోసం వినియోగిస్తున్న 3,962 స్కైప్ ఐడీలను, 83,668 వాట్సాప్ ఖాతాలను భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గుర్తించి బ్లాక్ చేసిందని వివరించారు. 2021లో  సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటైందని, దీని ద్వారా ఇప్పటివరకు 13.36 లక్షలకు పైగా ఫిర్యాదులు అందాయని, సుమారు రూ. 4,386 కోట్లు కాపాడగలిగామని పేర్కొన్నారు.

మహిళలు, చిన్నారులే లక్ష్యంగా జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి సారించామని బండి సంజయ్ తెలిపారు. డిజిటల్ నేరాలకు సంబంధించి ఫిర్యాదు చేయడానికి సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (https://cybercrime.gov.in) అందుబాటులో ఉందని, దీని ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారని, సంబంధిత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అధికారులు చర్యలు చేపడతారని వివరించారు.

Bandi Sanjay
Cybercrime
Digital arrests
SIM cards
WhatsApp accounts
IMEI numbers
Skype IDs
Cybercrime Reporting Portal
India
Government initiatives
  • Loading...

More Telugu News